క్లినిక్ పెట్టి వైద్యం.. కాంపౌండర్ పై కేసు.. మధురానగర్ లో ఘటన

క్లినిక్ పెట్టి వైద్యం.. కాంపౌండర్ పై కేసు.. మధురానగర్ లో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: ఓ హాస్పిటల్​లో కాంపౌండర్​గా చేస్తూ.. క్లినిక్​ ఓపెన్​చేసి, వైద్యం చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమదాసు రామకృష్ణ రహమత్ నగర్ చౌరస్తాలోని అశోక్ రావు హాస్పిటల్​లో కాంపౌండర్. ఇతను బంగారు మైసమ్మ ఆలయ సమీపంలో సాయి జనార్ధన్ పేరుతో క్లినిక్ నడిపిస్తూ డాక్టర్ గా చెలామణి అవుతున్నాడు. 

డబ్బు సంపాదనే ధ్యేయంగా అర్హత లేకున్నా తెలిసీ తెలియని వైద్యం చేస్తున్నాడు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో  కొందరు స్థానికులను బుధవారం సాయంత్రం క్లినిక్ కు పంపారు. వీరు వెళ్లేసరికి అతను కొందరు పేషెంట్లకు వైద్యం చేస్తున్నాడు. 

దీంతో పోలీసులు వచ్చి వివిధ వైద్య పరికరాలు, మందులు, ఇంజెక్షన్లు, రబ్బర్​స్టాంప్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్​ను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.