రెండో రోజుకు బస్వాపూర్​ నిర్వాసితుల ఆందోళన

రెండో రోజుకు బస్వాపూర్​ నిర్వాసితుల ఆందోళన

యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వెంటనే అమలు చేసి ఇండ్ల స్థలాలు కేటాయించాలని లప్పనాయక్ తండా భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. నిర్వాసితులు రిజర్వాయర్ కట్టపై చేస్తున్న నిరసన దీక్షలు రెండో రోజు శుక్రవారం కొనసాగించారు. పనులను అడ్డుకోవడంతో మట్టి టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. పరిహారం కోసం గతంలో నిరసన దీక్షలు చేసిన సమయంలో సరిగ్గా నెలలోపు సమస్యలు పరిష్కరిస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారని, నాలుగు నెలలు గడుస్తున్నా పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు దీక్షలు విరమించేది లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ మంక్యా నాయక్, మాజీ సర్పంచ్ గాశీరాం, వార్డు సభ్యులు యాదమ్మ, మోహన్, సురేశ్, భారతి, లక్ష్మి,  గ్రామస్తులు పాల్గొన్నారు.