పొత్తులపై సీపీఐలో సందిగ్ధం

పొత్తులపై సీపీఐలో సందిగ్ధం
  • కాంగ్రెస్​తోనా? సీపీఎంతోనా?
  • ఇయ్యాల రాష్ట్ర కమిటీలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: పొత్తులపై సీపీఐలో సందిగ్ధం నెలకొంది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందా? సీపీఎంతో కలిసి వెళ్తుందా? అనేది తేలాల్సి ఉంది. దీనిపై శుక్రవారం జరగనున్న రాష్ట్ర కమిటీ మీటింగ్ లో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే తెలిపింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు సీట్లు సీపీఐకి కేటాయించే అవకాశం కనిపించడం లేదు. దీంతో పొత్తు ఉంటుందా? లేదా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. లెఫ్ట్ కు సీట్లు ఇచ్చేది లేదని, ఎమ్మెల్సీ స్థానం మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే ప్రకటనలు చేస్తునారు. దీనిపై సీపీఐ నేతలు సీరియస్​గా ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్​లో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ తో పొత్తులు, సీపీఎంతో కలిసి పోటీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సీట్లు కేటాయించకున్నా ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతివ్వాలని కొందరు, సీపీఎంతో కలిసి పోటీ చేయాలని ఇంకొందరు ప్రతిపాదిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సీపీఎం, సీపీఐ నేతల భేటీ...

మగ్దూంభవన్ లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రతిపాదనలపై చర్చించారు. పొత్తులపై నెలన్నరగా చర్చలు జరుగుతున్నా, ఏ సీట్లు కేటాయిస్తామనే దానిపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వకపోవడంపై లెఫ్ట్ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతిపాదనలను సీపీఎం వ్యతిరేకించింది. పొత్తు ఉండదని స్పష్టం చేసింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్ నేతలతో మాట్లాడి, శుక్రవారం తేలుస్తామని తెలిపినట్టు సమాచారం. సమావేశంలో నారాయణ, తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డి, కూనంనేని తదితరులు పాల్గొన్నారు.