కాబోయే సీఎం కేటీఆర్​కు కంగ్రాట్స్​

కాబోయే సీఎం కేటీఆర్​కు కంగ్రాట్స్​

కేటీఆర్​ సమక్షంలోనే అభినందించిన డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​

ఆ మాటలు వింటూ టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ చిరునవ్వులు

సికింద్రాబాద్, వెలుగు: టీఆర్​ఎస్​లో ‘సీఎం కేటీఆర్​’ కోరస్​ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​ కూడా గొంతు కలిపారు.గురువారం సికింద్రాబాద్​లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ డివిజన్ ఆఫీసు ఓపెనింగ్​లో  పాల్గొన్న ఆయన ‘‘పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, బహుశా ​కాబోయే సీఎం.. కేటీఆర్​కు శుభాకాంక్షలు. ​ ముఖ్యమంత్రి అయ్యాక రైల్వే ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా కాపాడుతారని ఆకాంక్షిస్తున్న. శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున కేటీఆర్​కు శుభాకాంక్షలు’’ అంటూ వ్యాఖ్యానించారు. పద్మారావుగౌడ్​ ఇలా మాట్లాడుతుండగా స్టేజీపైన మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటలు విన్న కేటీఆర్​.. పద్మారావును చూస్తూ చిరునవ్వులు నవ్వారు. డిప్యూటీ స్పీకర్​ తాజా కామెంట్లతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. అది కూడా కేటీఆర్​ సమక్షంలోనే  ఇలా అభినందించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్​గా మారింది.మంత్రి కేటీఆర్​ తన ప్రసంగంలో ఎక్కడ కూడా పద్మారావుగౌడ్​ మాటలను ఖండించకపోవడం, సమర్థించకపోవడం ఆసక్తిగా మారింది.

రైల్వే కార్మికుల తరఫున ఉంటాం: కేటీఆర్​

దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై  వంటి మెట్రో సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇలాంటి టైంలో సౌత్​ స్టేట్స్​కు  కేంద్ర బడ్జెట్​లో పెద్దపీట వేయాలని మంత్రి కేటీఆర్​ అన్నారు.  హైస్పీడ్, బుల్లెట్  రైళ్లు అందుబాటులోకి వస్తే ఎక్కడో ఉన్న కరీంనగర్​, ఆదిలాబాద్​, ఖమ్మం వంటి పట్టణాలనుంచి గంటలోనే నగరానికి చేరకోవచ్చని, అయితే సౌత్​కు అలాంటి రైళ్లు అందుబాటులోకి రాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కాజీపేటలో రైల్వే  వ్యాగన్​, కోచ్​ ఫ్యాక్టరీ కేటాయిస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఈ కోచ్​ ఫ్యాక్టరీకి  కేంద్రం 130 ఎకరాల స్థలాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 350 ఎకరాలు సేకరించిందని, అయినా ఇప్పటివరకు అక్కడ ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం రైల్వే అభివృద్ధిని కోరుకుంటున్నదన్నారు. రైల్వే ఉద్యోగుల హక్కులకు భంగం కలుగనివ్వమని, అలా జరిగితే కార్మికుల తరఫున నిలుస్తామని
మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.