
- కేసీఆర్, రేవంత్ దిష్టిబొమ్మల దహనాలు
- పలు జిల్లాల్లో పరస్పరం తోపులాటలు
- విద్యుత్ సౌధా ముందు బైఠాయించిన కవిత
- భారీగా ట్రాఫిక్ జాం.. ప్రయాణికులకు ఇక్కట్లు
- ధర్నాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనలతో రాష్ట్ర అట్టుడికింది. జంక్షన్లు జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. హైదరాబాద్ లో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. సాగుకు ఉచిత విద్యుత్ మూడు గంటలు చాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా విద్యుత్ పంపిణీ సంస్థలను కేసీఆర్ కమీషన్ల కోసం 60 వేల కోట్ల అప్పుల్లో ఉంచారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టింది. పలు చోట్ల అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాల్గొన్నారు.
ఖైరతాబాద్ లోని విద్యుత్ సౌధా వద్ద ఎమ్మెల్సీ కవిత బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయగా.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్, కాంగ్రెస్ దిష్టబొమ్మలను కాలబెట్టి నిరసన తెలిపారు. పోటా పోటీ ఆందోళనలతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఏఈ ఆఫీసు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచారని ఆందోళన కారులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుపడ్డారు. దగ్గరలో ఉన్న డ్రమ్ములోంచి నీళ్లు తెచ్చి ఆర్పి వేశారు. కాసేపు పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.
మేడ్చల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో మంత్రి మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 44వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. మరో వైపు పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద నిర్వహించిన ఆందోళనలో హైదరాబాద్-ముంబై రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. అధికార పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కావడంతో పోలీసులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపూర్ సబ్ స్టేషన్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలోని టెక్స్ టైల్ పార్కు వద్ద మంత్రి కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండలు వేశారు. వేముల వాడలో బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే చోట నిరసనలకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ను ముట్టడించారు. అదే సమయంలో పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అటు వైపు ర్యాలీగా రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏది ఏమైనా ఈ రెండుపార్టీల ఆందోళనకు పబ్లిక్ కు పరేషన్ తెచ్చిపెట్టాయి.