మణిపూర్​ ఇష్యూపై చర్చించాల్సిందే

మణిపూర్​ ఇష్యూపై చర్చించాల్సిందే
  • ఆల్ పార్టీ మీటింగ్​లో ప్రతిపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు : మణిపూర్​లో చెలరేగిన అల్లర్లు, ధరల పెరుగుదల, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి తదితర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్​తో పాటు ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. గురువారం నుంచి పార్లమెంట్ మాన్​సూన్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బుధవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ భేటీలో వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని.. పార్లమెంట్ సెషన్ సజావుగా సాగాలంటే ప్రతిపక్షాలకు కూడా మాట్లాడేందుకు టైం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

మణిపూర్​లో జరిగిన అల్లర్లపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోరింది. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. మాన్​సూన్ సెషన్ ఆగస్టు 11 వరకు కొనసాగుతుందన్నారు. నిబంధనల ప్రకారం.. చైర్ ఆమోదించిన ప్రతీ అంశంపై చర్చకు సిద్ధమన్నారు. 

చర్చకు చాన్స్ ఇస్తేనే సజావుగా సెషన్..

ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు ఆమోదిస్తేనే సెషన్ సజావుగా కొనసాగుతుందని కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్​లోనూ నేను పాల్గొన్నా. అన్ని అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పా. ఆల్ పార్టీ మీటింగ్​లోనూ ఇదే విషయమై మాట్లాడా. మణిపూర్ అల్లర్లపై డిస్కస్ చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడాలని కోరుతున్నా” అని చౌదరీ అన్నారు.

నా దారి.. రహదారి అంటే కష్టమే..: జైరామ్ రమేశ్

పార్లమెంట్ మాన్​సూన్ సెషన్​లో మణిపూర్ అల్లర్లు, ధరల పెరుగుదలపై చర్చించాలన్న డిమాండ్​పై రాజీపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్​లీడర్ జైరామ్ రమేశ్ అన్నారు. నా దారి.. రహదారి అనే కేంద్రం విధానం వీడాలని తెలిపారు. సెషన్ సజావుగా సాగేందుకు మధ్యే మార్గాన్ని అనుసరించాలన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందన్నారు.

ఢిల్లీ ఆర్డినెన్స్​ను వ్యతిరేకిస్తున్నాం: కే.కేశవ్ రావు

తాము ఎన్డీఏ, ‘ఇండియా’లో ఎవరికి సపోర్ట్ చేస్తామనేది వాళ్లు చేపట్టే ప్రోగ్రామ్​ల ఐడియాలజీతోనే డిసైడ్ అవుతుందని బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఎంపీ నామాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల మీటింగ్​కు వెళ్లిన పార్టీలు కాంగ్రెస్, వెళ్లని పార్టీలు ఎన్డీఏ కావన్నారు. 

బీఆర్ఎస్​తో పాటు చాలాపార్టీలు ఈ మీటింగ్​ల​కు అటెండ్ కాలేదన్నారు. ఫ్రంట్​లు ఏర్పాటుచేస్తే సరిపోదని, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఢిల్లీ ఆర్డినెన్స్​ను వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఆల్ పార్టీ మీటింగ్​లో ఏపీ నుంచి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల, ఇతర పార్టీ లీడర్లు పాల్గొన్నారు.