- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్టలోని 10వ వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధునేని ధనలక్ష్మీ మధుకర్ కు మద్దతుగా సోమవారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట పట్టణానికి మళ్ళీ పూర్వ వైభవం తేవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు.
ఆలయ అభివృద్ధిలో ఇండ్లు, షాపులు, భూములు కోల్పోయిన నిర్వాసితులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, తద్వారా బాధితులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో లేని బీఆర్ఎస్ కు ఓటేస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గౌడ్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు బందారపు భిక్షపతి, మండల నాయకుడు హేమేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
