ఆధారాలు లేకుండా కామెంట్లు చేస్తవా? : సుడా చైర్మన్ కోమటిరెడ్డి

ఆధారాలు లేకుండా కామెంట్లు చేస్తవా? : సుడా చైర్మన్  కోమటిరెడ్డి
  •     బండి సంజయ్ పై పోలీసులకు కాంగ్రెస్  ఫిర్యాదు

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్  నాయకులకు, ఎంఐఎం నాయకులకు మధ్య రూ.100 కోట్ల ఒప్పందం కుదిరిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  చేసిన ఆరోపణలపై కరీంనగర్  జిల్లా కాంగ్రెస్  పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుడా చైర్మన్  కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  సత్తు మల్లేశం, అర్బన్  బ్యాంక్  చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆ‌‌ర్టీఏ మెంబర్  పడాల రాహుల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  ఆకారపు భాస్కర్ రెడ్డితో కూడిన బృందం సోమవారం కరీంనగర్  వన్ టౌన్ సీఐకి ఫిర్యాదు చేసింది. 

ఈ సందర్భంగా నరేందర్  రెడ్డి మాట్లాడుతూ బండి వ్యాఖ్యలపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరాధారమైన ఆరోపణలుగా తేలితే ఇందిరా చౌక్  వద్ద బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు. ఆధారాలు చూపించకుండా నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అభివృద్ధి గురించి చెప్పుకునేది లేక మతాల మధ్య చిచ్చుపెట్టడం బండి సంజయ్ కి కొత్త కాదని  సత్తు మల్లేశం విమర్శించారు.