కోర్టుకెళ్తారన్న భయంతోనే డీఏ ఇచ్చిన్రు ..ఉద్యోగుల మీద కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి ప్రేమలేదు

కోర్టుకెళ్తారన్న భయంతోనే డీఏ ఇచ్చిన్రు ..ఉద్యోగుల మీద కాంగ్రెస్‌‌ ప్రభుత్వానికి ప్రేమలేదు
  • హైదరాబాద్ కార్పొరేషన్‌‌ సహా బల్దియాల్లో బీజేపీ జెండా ఎగరేస్తం
  • కేసీఆర్‌‌ కనిపించేది ఫాంహౌజ్‌‌లో.. లేదంటే ఆస్పత్రిలో..
  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఉద్యోగులు కోర్టుకు వెళ్తారన్న భయంతోనే ప్రభుత్వం ఒక డీఏను రిలీజ్‌‌ చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌‌ విమర్శించారు. ఆరు డీఏలు పెండింగ్‌‌లో పెట్టిన ఈ ప్రభుత్వానికి ఉద్యోగులపై ప్రేమ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటకారి అని, ఆయన తిమ్మిని బమ్మిని చేసి చెప్తారని ఎద్దేవా చేశారు. 

సోమవారం సిరిసిల్ల నుంచి మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు డీఏలు ఇయ్యలేదు. ఈ నెలతో ఆరు డీఏలు పెండింగ్‌‌లో ఉన్నట్లు అవుతుంది. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగులకు డీఏలు ఇయ్యకుంటే ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని అంగీకరించాల్సి ఉంటుంది. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు పోతే ప్రభుత్వం మొత్తం ఆరు డీఏలు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఒక డీఏ ఇచ్చి ఆ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు’ అని చెప్పారు. 

కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారు ?

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని, హైదరాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంటుందని బండి సంజయ్‌‌ ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్రం రూ.30 కోట్ల నిధులిచ్చిందని, అమృత్ పథకం కింద రూ.104 కోట్లు కేటాయించిందని ఆ నిధులను ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇవ్వలేదన్నారు. 

కేంద్రం ఇచ్చిన నిధులను అభివృద్ధికి వాడకపోవడం వల్లే సిరిసిల్ల టౌన్, కలెక్టరేట్ మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్‌‌ అధికారంలో లేదని, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదని ఆ పార్టీకి ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని అన్నారు. 

‘బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఇంకో దిక్కు, అల్లుడు మరో దిక్కు. అసలు ఆ పార్టీ ఉంటదో, ఉండదో తెల్వక కేసీఆర్ ఫాంహౌజ్‌‌లో పడుకున్నడు. కేసీఆర్ కన్పించేది ఆస్పత్రిలో.. లేదంటే ఫాంహౌజ్‌‌లో తప్ప జనంలోకి వచ్చిందే లేదు’ అని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యభుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, ఆడెపు ప్రభాకర్, రాజు పాల్గొన్నారు.