- 2,367 మందికి కాంట్రాక్టు పద్ధతిలో టీచర్ కొలువులు
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయినా ఉద్యోగాలు రాని అభ్యర్థులకు కాంగ్రెస్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు పద్ధతిలో వారి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఉద్యోగాల్లో చేరే అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు. డీఎస్సీ 2008లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని నోటిఫికేషన్ లో నాటి ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది.
దీంతో ఫస్ట్ లిస్టులో ఎంపికైన 2,367 మందికి సెకండ్ లిస్టులో కొలువులు రాలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని అప్పటి నుంచి ఎంపికైన అభ్యర్థులు పోరాటం చేస్తున్నారు. చివరగా సుప్రీంకోర్టు కూడా వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరిపై రాష్ట్ర సర్కారు సానుకూలంగా ఉండడంతో, వారిని ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో సుమారు 2,367 మంది ఉండగా వారిలో చాలా మంది ఇప్పటికే వివిధ ఉద్యోగాల్లో చేరిపోయారు. ప్రస్తుతం 1300 మంది వరకూ ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్లో పెట్టనున్నారు. దీంట్లోనే ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తూ ధ్రువీకరించే పత్రం కూడా ఉంటుంది. దీన్ని నింపి ఉమ్మడి డీఈఓ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకూ డీఈఓ ఆఫీసుల్లో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పాల్గొనాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వచ్చేవారికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
