కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధే హైదరాబాద్ !

కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధే  హైదరాబాద్ !

ఒకనాడు నవాబుల నగరంగా రూపుదిద్దుకొని దిన దిన ప్రవర్ధమానమై నేడు విశ్వనగరంగా ప్రపంచ యవనికపై  హైదరాబాద్​  మెరుస్తోంది. ఈ చారిత్రక నగరానికి పరుగులు నేర్పింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు.  స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే  హైదరాబాద్​కు విశ్వనగరంగా ఎదిగే అపార అవకాశాల్ని నాటి దార్శనిక నేతలు కలిపించారు. నవరత్న కంపెనీల ఏర్పాటు వాటికి అనుబంధంగా అనేక రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో ప్రపంచాన్ని ఆకర్షించే రాచరిక హంగులకు అదనంగా అభివృద్ధి నగిషీలను అద్దారు. 

డీ ఆర్ఆడీఓ వంటి అతికీలక రక్షణ రంగ ప్రాజెక్టును 1950లలోనే మొదలుపెట్టి దశలవారీగా అనేక హంగుల్ని సమకూర్చారు. భారత  అణుఇంధన  రంగానికే తలమానికంగా ఇందన శుద్ధి కేంద్రం న్యూక్లియర్ ప్యూయల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్ సి), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) వంటి సంస్థలతో  రక్షణరంగంలో దేశాన్ని స్వయంసమృద్ధి చేయడంతోపాటు వేలాదిమంది తెలంగాణ బిడ్డలకు, హైదరాబాదీలకు అత్యుత్తమ ఉపాధి అవకాశాల్ని కల్పించారు. 

ఫార్మా హబ్​గా  హైదరాబాద్

మహమ్మారి కొవిడ్​ నుంచి  ప్రపంచానికే  రక్షణ కల్పించిన ఫార్మా హబ్​గా  హైదరాబాద్​ మారడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటిన విత్తనాలే ఉన్నాయి. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్  ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ,  ఐఐసీటీ,  సీసీఎంబీ వంటి సంస్థలను ఏర్పాటు చేసి ఫార్మా రంగంలో బీజాక్షరాలు నాటింది కాంగ్రెస్. అంతేకాకుండా ప్రత్యేకంగా ఫార్మాను ఇండస్ట్రీగా గుర్తిస్తూ ప్రత్యేక పారిశ్రామిక కారిడార్ జీనోమ్ వాలీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్, దాని ఫలితమే నేడు ప్రపంచ వ్యాప్త ఫార్మా ఎగుమతుల్లో భారత వాటా గణనీయంగా పెరిగితే... అందులో సగం వాటా హైదరాబాద్​దే,  వ్యవసాయ రంగంలోనూ దేశానికే కాదు ప్రపంచానికే దిక్సూచిలా మారిన అద్భుత  రీసెర్చ్ సంస్థలైన ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ ఫర్ ది సెమీ అరిడ్ ట్రాపిక్స్ ( ఇక్రిశాట్), నేషనల్ అకాడమీ ఆఫ్​ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ యూ),  కేంద్రీయ వ్యవసాయ పరిశోదనా సంస్థ, భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, పౌల్ట్రీ పరిశోధనా డైరెక్టరేట్​ వంటి ఎన్నో సంస్థల్ని ఏర్పాటు చేసి ఇటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కాకుండా ప్రత్యక్షంగా వేలాది తెలంగాణ, హైదరాబాదీలకు ఉపాధి కల్పించింది కాంగ్రెస్. 

పేదలకు వైద్య భరోసా

ఇక సామాన్యుడికి అవసరమైన వైద్యరంగాన్ని పటిష్టపరిచింది  కాంగ్రెస్ పార్టీ,  ఉస్మానియాకు ఆధునిక హంగులు సమకూర్చడంతో పాటు నేడు అత్యాధునిక భవనాల్ని నిర్మించడానికి పూనుకుంది. చెస్ట్ ఆసుపత్రికి మహర్దశ, గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నిర్మాణం, చారిత్రక నిజాం నిమ్స్ హాస్పిటల్​కు వైభవం తేవడంతో పాటు పేట్లబుర్జు, చార్మినార్ యునానీ, రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలు ఆసుపత్రులు ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని  ప్రతి  ముఖ్యమైన సెంటర్లో  పీహెచ్​సీలు మొదలు 50 పడకల ఆసుపత్రుల్ని నిర్మించి పేదలకు వైద్య భరోసాను అందించింది కాంగ్రెస్. ప్రపంచాన్ని శాసిస్తున్న సాఫ్ట్​వేర్ రంగం సైతం నగరంలో  వేళ్లూనుకునేలా పునాదిరాయి వేసింది నాటి రాజీవ్ హయాంలోని కాంగ్రెస్  సర్కారే.  

 మూసీ ప్రక్షాళన 

 మూసీ ప్రక్షాళన చేసి హైదరాబాదీకి  ప్రపంచస్థాయి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా అహర్నిశలు పాటుపడుతున్నారు.  నగరవాసి వైద్యానికి పెద్దపీట వేసేలా ఆస్పత్రుల నిర్మాణంతోపాటు ఆరోగ్యశ్రీని  రూ. 10 లక్షలకు పెంచాడు సీఎం రేవంత్.   ఆడబిడ్డలకు నెలకు వేలాది రూపాయలు ఆదాచేసేలా ఉచిత బస్సును అందించారు.  అంతేకాకుండా ప్రజారవాణా మెరుగు కోసం వేలాదిగా ఎలక్ట్రిక్ బస్సుల్ని నగరానికి తెస్తున్నారు.  నగరానికి తలమానికంగా నాటి కాంగ్రెస్ నిర్మించిన ఓఆర్ఆర్​కు అనుసంధానంగా ఆర్ఆర్ఆర్ నిర్మించడమేకాక, ఏకంగా ప్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ సిగలో మరో  కోహినూర్​ను చేరుస్తున్నారు.  అందులో ప్రపంచస్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ,  యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.  మెట్రోను  నేడు  ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇటు ఎయిర్ పోర్ట్, అటు హయత్​నగర్, ఇటు పటాన్ చెరు, మేడ్చల్, శామీర్ పేట్ ఇలా నగరమంతా మెట్రోను విస్తరించే పని చేస్తున్నారు.

కాంగ్రెస్​ సర్కారుపై ప్రజల ధీమా

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు సైతం తమకు ఎవరు మేలు చేస్తారో  గ్రహించారు.  తమ ఏరియాలో వెంగళరావ్ నగర్ వంటి అద్బుత పార్కును,  కోట్ల విజయబాస్కర్ రెడ్డి వంటి ఇండోర్ స్టేడియాన్ని, నయా హాస్పిటల్, మెట్రోను, అన్నింటికీ మించి పేదోడి కడుపు నింపేలా అందించిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్న రేవంతన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలు నిర్ణయించుకొన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో రేవంతన్న 42శాతం రిజర్వేషన్ బీసీలకు  కల్పించడం కోసం అసెంబ్లీలో  బిల్లు, ఆర్డినెన్స్, జీవో వంటి అన్ని ప్రయత్నాలు చిత్తశుద్ధిగా  చేయడమే కాకుండా న్యాయపోరాటం చేస్తున్నారు. మొక్కవోని సంకల్పంతో ఒక బీసీ బిడ్డకు జూబ్లీహిల్స్​లో అవకాశం ఇచ్చారు.  నవంబర్​లో జరిగే ఎన్నికల్లో రేవంతన్న సారథ్యంలోని కాంగ్రెస్​ పార్టీని గెలిపించుకుంటామని ధీమాగా ప్రజలు చెబుతున్నారు.

- పున్నా కైలాస్ నేత,
జనరల్ సెక్రటరీ,టీపీసీసీ