వానాకాలం సాగు కోటి ఎకరాలపైనే!ఎల్నినో హెచ్చరికలను ఖాతరు చేయని రైతులు

వానాకాలం సాగు కోటి ఎకరాలపైనే!ఎల్నినో హెచ్చరికలను ఖాతరు చేయని రైతులు
  • రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలు
  • 47.73 లక్షల ఎకరాల్లో వరి
  • 48.02 లక్షల ఎకరాల్లో సాగైన పత్తి
  • తగ్గిన నూనె గింజల సాగు
  • పంటల సాగులో నల్గొండ టాప్‌‌‌‌‌‌‌‌
  • అత్యల్పంగా మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లా
  • 3 జిల్లాల్లో సాధారణానికి మించి సాగు
  • ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు కోటి ఎకరాలు దాటింది. ఎల్​నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులతో ఈసారి సాగు తగ్గుతుందని భావించారు. కానీ, ఈ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలతో సాగు ఒక్కసారిగా ఊపందుకుంది. గత నెల వరకు నామమాత్రంగా ఉన్న వరినాట్లు వర్షాలతో జోరందుకున్నాయి. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,32,38, 446 ఎకరాలు కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 15 లక్షల 24 వేల 214 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణంలో ఇప్పటి వరకు 87 శాతం పంటలు సాగు జరిగింది. ఎల్​నినో హెచ్చరికలను పట్టించుకోకుండా రైతులు భారీగా పంటలు సాగు చేయడం గమనార్హం.


ఈ సీజన్‌‌‌‌లో ఇప్పటి వరకు 47.73 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. సాధారణంగా 65.95 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా.. ఇప్పటికే 72శాతం వరినాట్లు వేశారు. మొదట్లో వానలు లేకపోవడంతో ఆలస్యంగా మొదలైన వరినాట్లు ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సీజన్​ ముగిసే నాటికి వరి సాగు 55లక్షల ఎకరాలు దాటే అవకాశం ఉందని అగ్రికల్చర్​ అధికారులు అంటున్నారు. ఈ సీజన్​లో అత్యధికంగా 48.02లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. గత ఏడాది కంటే ఈసారి 3.29లక్షల ఎకరాల్లో పత్తి ఎక్కువ వేశారు. సాధారణంగా పత్తి 47.41లక్షల ఎకరాల్లో సాగయ్యేది. ఈసారి ఆ విస్తీర్ణాన్ని దాటేసింది. రాష్ట్రంలో మక్కల సాగు బాగా పెరిగింది. మొత్తం 5లక్షల 65వేల 27 ఎకరాల్లో మక్కల సాగు జరిగింది. పెసలు లక్షా 38వేల 927 ఎకరాల్లో, జొన్న 29వేల 951ఎకరాలు, సజ్జలు 930 ఎకరాలు, రాగులు 862 ఎకరాలు, ఎర్రజొన్నలు 540 ఎకరాల్లో సాగయ్యాయి. 

పడిపోయిన నూనె గింజల సాగు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు సైతం అవగాహన కల్పించారు. దీని వల్ల వరి సాగు తగ్గి పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెరుగుతుందని అంతా భావించారు. కానీ, రైతులు మాత్రం ఎప్పట్లాగే అధికారుల మాటలను చెవికెక్కించుకోలేదని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతోంది. వరి సాగు 50లక్షల ఎకరాలకు చేరువవుతుండగా, పప్పు ధాన్యాల విస్తీర్ణం పెద్దగా పెరగలేదు. రాష్ట్రంలో కంది సాధారణ విస్తీర్ణం 5.44 లక్షల ఎకరాలకు గాను 5.32 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. ఇక ఎప్పట్లాగే ఈ వానాకాలంలోనూ నూనె గింజల సాగు బాగా పడిపోతోంది. సోయాబీన్​ తప్ప రైతులు ఇతర ఆయిల్​ సీడ్​ పంటలు వేయట్లేదు. సోయా కూడా 4.16 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను కేవలం 3.72లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. ఈ సీజన్ లో పల్లీలు 4,617ఎకరాలు, ఆముదం 2,338ఎకరాలు, నువ్వులు 273 ఎకరాలు, పొద్దు తిరుగుడు 63ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. 

 పంటల సాగులో నల్గొండ టాప్‌‌‌‌..

సాగు విస్తీర్ణంలో నల్గొండ జిల్లా మొదటిస్థానంలో ఉంది. జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సంగారెడ్డిలో 6.97లక్షల ఎకరాలు, ఆదిలాబాద్‌‌‌‌జిల్లాలో 5.88లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 5.16లక్షల ఎకరాల్లో, నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 5.08లక్షల ఎకరాల్లో, ఆసిఫాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో 4లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. అతితక్కువగా ములుగు జిల్లాలో 77,389 ఎకరాల్లో , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 12,699 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఆదిలాబాద్‌‌‌‌, ఆసిఫాబాద్, నిర్మల్​ జిల్లాల్లో మాత్రమే సాగు టార్గెట్‌‌‌‌ వందశాతానికి చేరింది. నిజామాబాద్​ 98%, సంగారెడ్డి, కామారెడ్డిల్లో 96%, పంటల సాగు జరిగింది.