గొప్ప సామాజిక విప్లవకారుడు, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్యస్థాపన చేసిన గొప్ప వీరుడు, తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మహాత్మా జ్యోతి రావు ఫూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలుచేసిన గొప్ప సామాజిక విప్లవ కారుడు పాపన్న. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొగలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
శ్రీ రేణుక ఎల్లమ్మ వీర భక్తుడు
పాపన్న జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం లోని ఖిలాషాపూర్‌లో 18 ఆగస్టు 1650న పాపన్న వరంగల్ జిల్లాలో గౌడ కులంలో జన్మించాడు. నాసగోని దర్మన్న, సర్వమ్మల కుమారుడు. తండ్రి చిన్నతనంలోనే చనిపోతే అన్నీ తానై పెంచింది తల్లి సర్వమ్మ. ప్రజలు ప్రేమ ఆప్యాయతలతో పాపన్నను పాపన్న దొర అని పిలిచేవారు. సర్వమ్మ మాత్రం పాపడు అని పిలిచేది. పాపన్న గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ వీర భక్తుడు. పాపన్న శివున్ని ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. కానీ అప్పటి సామాజిక పరిస్థితులు పాపన్నను పోరాట యోధుడుగా మార్చాయి. పాపన్న ఎక్కువగా బహుజన కులాల వారితో కలిసి తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు. వీరందరూ బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే.
ఛత్రపతి శివాజీకి సమకాలికుడు పాపన్న
పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం, ధనం, అధికారం లేవు. 12,000 మందితో గెరిల్లా సైన్యాన్ని, వారికి తోడుగా 3000 మందితో పదాతి దళాలు, 500 మందితో రక్షక దళాలను ఏర్పాటు చేసుకున్నాడు. మొగలు సైన్యంపై తన సైన్యంతో దాడిచేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీకి సమకాలికుడు పాపన్న. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణలో మొగలుల పాలన అంతానికి పోరాడారు. 1687 –- 1724 వరకు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుంచి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. చివరకు గోల్కొండ కోటను స్వాధీనపరచుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు.
పాపన్న స్ఫూర్తిగా..
పాపన్న చరిత్రను ఆంగ్లేయ కవి జే.యే. బోయేల్ ఇండియన్ అంటిక్వెరి పత్రికలో 1874లోనే రాశారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ బుక్‌లో పాపన్న గురించి రాశారు. చరిత్రను పరిశోధించి తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ దివంగత ఆచార్య పేర్వారం జగన్నాథం, పీహెచ్‌డీ తీసుకుని పాపన్న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపురానికి చెందినవాడని రుజువు చేశారు. ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర్‌శర్మ, ఆదిరాజు వీరభద్రరావు, చోల్లేటి నృసింహశర్మ రామరాజులు పాపన్న చరిత్రను
వెలుగులోకి తెచ్చారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ను కొంపల్లి వెంకటేష్ గౌడ్ రాశారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. పాపన్న జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని బహుజనులంతా సంఘటితమై రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి.
- పాకాల
శంకర్ గౌడ్
