- ‘సర్’ డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
- వచ్చే నెల 17 వరకు సవరణలకు అవకాశం
- ఆయా ఓటర్లకు నేరుగా నోటీసులు ఇవ్వనున్న బీఎల్వోలు
- ఆందోళన వద్దు.. సరైన ఆధారాలు ఇస్తే ఓటు భద్రం: సీఈవో సుదర్శన్ రెడ్డి
- ఏకపక్షంగా తొలగిస్తే కలెక్టర్, సీఈవోలకు అప్పీల్ చేసుకునే హక్కు
- స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్‌ఈసీదే
హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద దాదాపు 92.87 లక్షల మంది ఓటర్లకు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. ఇందులో ఇంటిపేరు, పేరు, ఊరు, వయస్సు తదితర వివరాల్లో తేడాలు (అనామలీస్) ఉన్న 60.50 లక్షలకు పైగా ఓటర్లతో పాటు, 2002 ఓటర్ లిస్టుకు సంబంధించిన వివరాలు లేకుండా సమర్పించిన దాదాపు 32.36 లక్షల మంది అన్-మ్యాప్డ్ ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు సర్ ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాల డేటా డిజిటైజేషన్ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. నెల రోజుల పాటు అంటే వచ్చే సెప్టెంబర్ 17వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలను సరిదిద్దుకునేందుకు, అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం, తగినంత సమయం కల్పిస్తున్నామని తెలిపారు. డ్రాఫ్ట్ లిస్టులో పేర్లు లేని ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులకు సరైన ఆధారాలతో సమాధానం ఇస్తే తుది జాబితాలో యథావిధిగా పేర్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రాబోయే జీహెచ్‌ఎంసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఈవో సుదర్శన్ రెడ్డి సమాధానం ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పరిధిలోనిదని, తాము కేవలం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను మాత్రమే సవరిస్తున్నామని చెప్పారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయిన తర్వాత అందుబాటులో ఉన్న డేటాను స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్ఈసీ ఉపయోగించుకుంటుందని తెలిపారు.
60.50 లక్షల ఓటర్ల వివరాల్లో తేడాలు..
నోటీసులు అందుకోనున్న 92 లక్షల పైగా ఓటర్లలో 60.50 లక్షల మంది ఓటర్ల వివరాల్లో వివిధ రకాల వ్యత్యాసాలు (అనామలీస్) నమోదైనట్లు సీఈవో వివరించారు. 2002 నాటి ఓటర్ల జాబితా డేటాను, ప్రస్తుత 2025–-26 జాబితాతో మ్యాపింగ్ చేసినప్పుడు ఈ తేడాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. పేర్లలో తేడాలు, ఇంటిపేరు లేదా తండ్రి/భర్త పేర్లలో మార్పులు, తెలుగు నుంచి ఇంగ్లీషుకు అనువాదంలో జరిగిన అక్షర దోషాలు, వయస్సులో వ్యత్యాసాలు వంటి దాదాపు 11 రకాల కారణాలతో ఆ పేర్లు అనామలీస్ జాబితాలోకి చేరాయని చెప్పారు. ఉదాహరణకు గతంలో ‘కె.నారాయణ కుమార్’ అని ఉంటే, ఇప్పుడు ‘కిన్నెర నారాయణ కుమార్’ అని ఉండడం వల్ల మ్యాపింగ్‌లో మిస్‌మ్యాచ్ అయ్యిందని తెలిపారు. అనామలీస్ జాబితాతో పాటు ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా దాదాపు 32 లక్షల మంది ఓటర్లు అన్-మ్యాప్డ్ (నో-మ్యాపింగ్) విభాగంలోకి వచ్చినట్లు సీఈవో వెల్లడించారు. ఎన్యుమరేషన్ సందర్భంగా ఓటర్లకు అందజేసిన ఫారాల్లో పైన ఉన్న మూడు ముఖ్యమైన కాలమ్స్ (2002 నాటి డేటాతో లింక్ చేసే వివరాలు) పూర్తి చేయకుండా, కేవలం కింది భాగంలోని ప్రస్తుత వివరాలను మాత్రమే పూరించి ఇచ్చినందున వారిని అన్-మ్యాప్డ్‌గా గుర్తించాల్సి వచ్చిందని తెలిపారు.
అత్యంత పకడ్బందీగా చేస్తరు
నోటీసుల జారీ, అందజేత ప్రక్రియ అత్యంత క్రమబద్ధంగా జరుగుతుందని సీఈవో వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రామాణిక ఫార్మాట్‌లోనే ఈ నోటీసులు ఉంటాయని, నోటీసులో సదరు ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎందుకు నోటీసు ఇస్తున్నామనే కారణాన్ని ఈఆర్వోలు స్పష్టంగా నమోదు చేస్తారని చెప్పారు. ఈ నోటీసు కాపీలను సంబంధిత బూత్ లెవల్ అధికారులు స్వయంగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి అందజేస్తారని తెలిపారు. ఒకవేళ ఓటరు చిరునామాలో అందుబాటులో లేకపోతే లేదా బీఎల్వో గుర్తించలేకపోతే, పోస్టల్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తారని పేర్కొన్నారు. నోటీసును అందించే సమయంలోనే బీఎల్వోలు సమస్యను, సమర్పించాల్సిన పత్రాల వివరాలను వివరిస్తారని చెప్పారు. ఓటర్లు తమ వివరణ పత్రాలను స్థానిక బీఎల్వోకు స్వయంగా అందజేయవచ్చని, బీఎల్వోలు వాటిని తీసుకుని సంబంధిత ఏఈఆర్వో, ఈఆర్వోలకు చేరవేస్తారని చెప్పారు. క్లిష్టమైన సమస్యలు లేని స్పష్టమైన కేసులను అధికారులు అక్కడికక్కడే పరిశీలించి పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కానీ అదనపు సమాచారం లేదా నిర్ధారణ అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఈఆర్వోలు సదరు వ్యక్తిని వ్యక్తిగత విచారణకు పిలుస్తారని స్పష్టం చేశారు. నోటీసుల కాలపరిమితిలో వచ్చే సమాధానాలను పరిష్కరించే ప్రక్రియ ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల పాటు విస్తృతంగా కొనసాగుతుందని వివరించారు. ఓటర్లు తమ నివాస ప్రాంతాలు మారినా, పోలింగ్ కేంద్రాల పరిధి మారినా క్లెయిమ్‌ల ద్వారా అవసరమైన మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు.
2 వేల మందితో నోటీసుల పరిష్కారం
రాష్ట్రంలో ఓటర్ల నోటీసుల జారీ, విచారణ, పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు దాదాపు 2 వేలకు పైగా అధికారులు విధులు నిర్వర్తిస్తారని సీఈవో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు), వారికి సహాయకులుగా 890 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్వోలు) క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నోటీసులు అందుకోనున్న ఓటర్ల సంఖ్య భారీగా ఉన్నందున, ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అదనంగా మరో 500 నుంచి 1,000 మంది వరకు ఏఈఆర్వోలను నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు. సమయం తక్కువగా ఉందని భావిస్తే, పరిస్థితులను బట్టి గడువు పొడిగింపు కోసం ఈసీని కోరే అవకాశం కూడా ఉంటుందన్నారు.
11 రకాల పత్రాలే ప్రామాణికం
ఓటర్లు తమ గుర్తింపు, నివాసాన్ని ధ్రువీకరించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 11 రకాల ప్రామాణిక పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని సీఈవో స్పష్టం చేశారు. ఇందులో ఆధార్ కార్డు అనేది కేవలం వ్యక్తి గుర్తింపు ధ్రువీకరణ కోసం మాత్రమే ఉపయోగపడుతుందని, సంపూర్ణ పౌరసత్వ లేదా నివాస రుజువు కాదని గుర్తుచేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఎఫ్ఆర్సీ) ఓటరు నమోదు పరిశీలనకు చెల్లదని, దీనిపై ఈసీఐ ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. కానీ 2013 కంటే ముందు తహసీల్దార్ల ద్వారా విచారణ జరిపి నిబంధనల ప్రకారం జారీ చేసిన పాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లకు సంబంధించిన పద్ధతిని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పరిశీలిస్తారన్నారు.
ఇవే పెద్ద నంబర్లు కావు..
ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు తెలంగాణలో నమోదైన గణాంకాలు అసహజమైనవి కావని సీఈవో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ దశలో దాదాపు 2.80 కోట్ల ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు వెలుగుచూశాయని, తమిళనాడులో 96 నుంచి 98 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో కోటికి పైగా, గుజరాత్‌లో 75 లక్షల వరకు ఇలాంటి తేడాలు నమోదయ్యాయని గణాంకాలతో సహా వివరించారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ, రాజధాని హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరంలో వలసలు, చిరునామాల మార్పులు ఎక్కువగా ఉండడంతో నగర పరిధిలోనే అధిక శాతం నోటీసులు జారీ అవుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య చాలా పరిమితంగా ఉందన్నారు.
అప్పీల్‌కు అవకాశం
రాష్ట్రంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తీసుకునే నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగా లేవని భావిస్తే ఓటర్లకు చట్టబద్ధమైన అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని సీఈవో వెల్లడించారు. ఎవరి పేరైనా సరైన విచారణ జరపకుండా, నిబంధనలు పాటించకుండా అన్యాయంగా తొలగించారని భావిస్తే, వారు జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో, జిల్లా కలెక్టర్) వద్ద అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టర్ నిర్ణయంపై కూడా అసంతృప్తి ఉంటే, తదుపరి అప్పీల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
