ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25 వేలు.. ఓసీలకు 50 వేలు!

ఎస్సీ, ఎస్టీ,  బీసీలకు 25 వేలు..  ఓసీలకు 50 వేలు!
  • ఎమ్మెల్యే టికెట్​ అప్లికేషన్​ 
  • ఫీజు ఖరారు చేసిన కాంగ్రెస్​ 
  • రేపట్నుంచి 25 వరకు దరఖాస్తులకు చాన్స్.. గతంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువగా ఫీజు 
  • అప్లికేషన్లు ఎక్కువ  వస్తున్నాయనే పెంపు 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. టికెట్ ఆశించేటోళ్లు అప్లయ్​ చేసుకునేందుకు అవకాశమిచ్చిన పార్టీ.. ఆ అప్లికేషన్ విధివిధానాలు, ఫీజును ఖరారు చేసింది. చైర్మన్ దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని సబ్​కమిటీ బుధవారం సమావేశమై విధివిధానాలను ఖరారు చేసినట్టు తెలిసింది. టికెట్ ఆశించే అభ్యర్థుల అప్లికేషన్ ఫీజును పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.25 వేలు.. ఓసీ అభ్యర్థులకు రూ.50 వేలుగా అప్లికేషన్ ఫీజు నిర్ణయించినట్టు తెలిసింది. నిజానికి గత ఎన్నికలప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.5 వేలు, ఓసీలకు రూ.10 వేలు అప్లికేషన్ ఫీజు ఉంది. కానీ ఈసారి దానిని 5  రెట్లు పెంచారు. పోయినసారి ఇబ్బడిముబ్బడిగా అప్లికేషన్లు వచ్చాయని, ఈసారి స్క్రీనింగ్ సాఫీగా సాగిపోవాలంటే ఫీజును పెంచాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఫీజు పెంచితే తక్కువ మంది అప్లయ్​ చేసుకునే చాన్స్​ ఉంటుందని, అందుకే ఈ నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

రిపోర్టు రెడీ..

సబ్​కమిటీ తన నివేదికను గురువారం పీసీసీకి సమర్పించనున్నట్టు తెలిసింది. టికెట్ ఆశించే అభ్యర్థులు గాంధీ భవన్​కు వచ్చి అప్లయ్​ చేసుకోవాలని, డీడీ రూపంలో డబ్బులు చెల్లించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని సమాచారం. కర్నాటకలో తరహాలోనే ఓసీలకు రూ.2 లక్షలు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష చొప్పున అప్లికేషన్ ఫీజు వసూలు చేయాలని తొలుత నిర్ణయించినప్పటికీ, పలువురు నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఫీజును రూ.50 వేలు, రూ.25 వేలుగా నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి గురువారం అధికారికంగా ప్రకటన రానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు అప్లయ్​ చేసుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అప్లికేషన్లు ముగిశాక ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించి, స్క్రీనింగ్​ కమిటీకి పంపిస్తుంది. సెప్టెంబర్​ తొలి వారంలో స్క్రీనింగ్​ కమిటీ సమావేశమై, జాబితాను సెంట్రల్​ఎలక్షన్​ కమిటీకి పంపుతుంది. అక్కడి నుంచి ఆదేశాలు రాగానే తొలి విడత అభ్యర్థుల ప్రకటన వెలువడుతుంది. 

సోషల్ మీడియా అకౌంట్ ఉందా? 

కాంగ్రెస్ అప్లికేషన్ ​ఫామ్ కూడా బయటకు లీకైంది. అందులో వివిధ ప్రశ్నలను పొందుపరిచారు. ‘‘మీకు సోషల్​ మీడియా అకౌంట్లు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ట్విట్టర్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ లో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారు? యూట్యూబ్​ చానల్​ నడుపుతున్నారా?’’ వంటి ప్రశ్నలను అప్లికేషన్ ఫామ్​లో పెట్టారు. అభ్యర్థుల నేర చరిత్రను తెలుసుకునేందుకు కూడా కాలమ్​ పెట్టారు. కేసులు ఉన్నాయా? ఉంటే ఏ స్టేషన్​లో ఏ సెక్షన్ కింద ఉన్నాయి? ఏ కేసులోనైనా దోషిగా తేలారా? అనే ప్రశ్నలను అప్లికేషన్​లో చేర్చారు. పొలిటికల్ హిస్టరీ, పార్టీలో ప్రస్తుత, గత హోదాలు, ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం తదితర వివరాలకు ఓ కాలమ్ పెట్టారు.