నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే

నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, త్వరలో మరిన్ని పదవులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో లోక్ సభ ఎన్నికలకు ముందే వీటిని భర్తీ చేసే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​తో సమావేశమై రాష్ట్రంలో పార్టీపై పలు విషయాలు చర్చించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం కూడా చర్చకు రాగా.. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలవాలని కాంగ్రెస్ టార్గెట్​గా పెట్టుకోవడంతో ఆ పార్టీ క్యాడర్ ఈ ఎన్నికల్లో కొత్త జోష్​తో పని చేసేందుకు ఈ పదవులను భర్తీ చేయాలనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలిసింది.

హామీ ఇచ్చినోళ్లకు చాన్స్​

తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా.. పార్టీలోని చాలా మంది నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. సంక్రాంతిలోపే ఈ  పదవులను భర్తీ చేస్తామని గతంలో రేవంత్ ప్రకటించారు. అయితే కొన్ని పరిస్థితుల వల్ల పెద్ద సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమైంది. త్వరలో లోక్​సభ ఎన్నికలు జరగనుండడంతో కొందరు సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లోనైనా తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని రేవంత్ తో పాటు రాష్ట్ర, జాతీయ నేతలను కోరారు. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో రేవంత్ కూడా పీసీసీ చీఫ్ హోదాలో కొందరు సీనియర్లకు హామీ ఇచ్చారు. ఇలాంటి వారికి నామినేటెడ్​ పోస్టులు దక్కే అవకాశం ఉందని చర్చ జరగుతున్నది. ఈ భేటీలో ఆరు గ్యారంటీల అమలు, లోక్ సభ టికెట్ల ఖరారుపై కూడా చర్చ సాగినట్లు తెలిసింది.