- హైకమాండ్ ఆదేశాలతో ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి భేటీ
జగిత్యాల, వెలుగు: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీ వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు ఏఐసీసీ సభ్యుడు కత్తి వెంకటస్వామి బుధవారం మధ్యాహ్నం జగిత్యాలకు వెళ్లి జీవన్‌రెడ్డిని కలిశారు. ఇరువురి మధ్య సుమారు అరగంట పాటు సమావేశం జరిగింది. పార్టీలో కొనసాగేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ఎలా పని చేస్తానని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసంతృప్తిని నివారించేందుకు కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపు చర్యలు చేపట్టారు.
ఇదివరకే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ ద్వారా జీవన్‌రెడ్డితో మాట్లాడగా, తాజా పరిణామాల్లో అధిష్టానం సూచనల మేరకు కత్తి వెంకటస్వామి ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం కత్తి వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ ‘‘అధిష్టానం ఆదేశాల మేరకు జీవన్‌రెడ్డిని కలిశాను. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడిని పార్టీ కోల్పోదు. ప్రస్తుతం ఆయన ఆవేదనలో ఉన్నారు” అని తెలిపారు.
జీవన్‌రెడ్డితో చర్చించిన అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. “అన్ని విషయాలపై మాట్లాడుకున్నాం. ఆయన ఏమన్నారు, నేను ఏమన్నానన్నది వెల్లడించలేను. ఆయన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేస్తాను. చివరి నిమిషంలో ఏదైనా నిర్ణయం మారవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
