
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ఆ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే బొగ్గు గనులను డైరెక్ట్‌గా సింగరేణికి కేటాయించకుండా వేలం వేస్తున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. ఆ రెండు పార్టీలు కలిసి సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ ను 16 ఎంపీ సీట్లలో గెలిపించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏపీలో టీడీపీకి 16 ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆ పార్టీ అడ్డుకోగలిగింది” అని అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు. ‘‘బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకున్నాం. ఇప్పుడు మేం దిగిపోగానే బొగ్గు గనులు వేలం వేస్తున్నారు. బీజేపీ చేస్తున్న ఈ పనికి కాంగ్రెస్ సహకరిస్తున్నది. బొగ్గు గనులు వేలం వేయొద్దని 2021 డిసెంబర్‌లో కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. ఆ తర్వాత మూడ్రోజులకు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి కూడా లేఖ రాశారు. అప్పుడు వేలం వేయొద్దని లేఖలు రాసి.. ఇప్పుడు వేలానికి సహకరించడం, వేలంలో పాల్గొనడం వెనుక మతలబు ఏంటి?” అని ప్రశ్నించారు. కేసుల భయమా? లేక ఇంకేదైనా ఉందా? అంటూ విమర్శించారు.
ఇతర రాష్ట్రాల్లో లేని వేలం ఇక్కడెందుకు?
బీజేపీ అధికారంలోకి వచ్చాక బిహార్, ఒడిశా, తమిళనాడులోని గనులను అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మాత్రం సింగరేణికి కేటాయించకుండా వేలం వేయడమేంటని ప్రశ్నించారు. ‘‘చత్తీస్‌గఢ్ లోని బైలదిల్లా గనిని కేటాయించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరినా ప్రధాని మోదీ పట్టించుకోలేదు. దాన్ని వేలం వేయించి అదానీకి కట్టబెట్టారు. క్యాప్టివ్ మైన్ లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ నష్టాల్లోకి వెళ్లింది. ఆ నష్టాలను సాకుగా చూపి ప్రైవేటీకరణకు ప్రయత్నించారు. ఇప్పుడు సింగరేణికి కూడా గనులు దక్కకుండా చేసి, ఆ తర్వాత నష్టాల పేరుతో ప్రైవేటీకరించే కుట్ర జరుగుతున్నది. బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ఇస్తే, వాళ్లు ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?” అని ప్రశ్నించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంత పాడుతున్నారని ఆరోపించారు. భట్టి నేరుగా వేలంలో పాల్గొననున్నారని, ఇది ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్టేనని అన్నారు. ‘‘2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన గనులను రద్దు చేస్తాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలు వేలంలో పాల్గొనవద్దు” అని హెచ్చరించారు.