కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ తహతహ!

కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ తహతహ!

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తు లేదని తేలడంతో వామపక్ష పార్టీలతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే సీపీఐ, సీపీఎం పార్టీల అగ్రనేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం అందుతోంది. సీపీఐ నేతలతో ఠాక్రే రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కమ్యూనిస్టులతో కలిసి వెళ్తే వచ్చే ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టవచ్చని, వామపక్ష పార్టీలకు గెలిచే సత్తా లేకున్నా ఓడించే సత్తా మాత్రం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు హై కమాండ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు ఉన్న ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పాజిటివ్ గా, అటు బీఆర్ఎస్ కు నెగిటివ్ గా మారే అవకాశం ఉందని వారు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

తమతో పొత్తు విషయం తేల్చకుండానే 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను కేసీఆర్ ప్రకటించడంతో భంగపడ్డ కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న తెలుస్తోంది. మునుగోడులో తమను వాడుకుని గట్టెక్కిన బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తో కలిసి రివేంజ్ తీర్చుకునే ఉద్దేశంతో ఆ పార్టీలు ఉన్నట్లు టాక్ వినపడుతోంది.  

కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ హ్యాండిచ్చిన తర్వాత ఎన్నికలు, పొత్తులపైనే సీపీఎం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఆదివారం రోజు (ఆగస్టు 27న) సీపీఎం పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టుకుంది. మరోవైపు.. సీపీఐ నేతలను మాణిక్ రావు ఠాక్రే చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. ముందుగా సీట్లు సంగతి తేలితేనే పొత్తు ఉంటుందని కామ్రేడ్లు చెబుతున్నట్లు సమాచారం అందుతోంది.

పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ అసెంబ్లీ సీట్లను వామపక్షాలు కాంగ్రెస్ ను అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాము కమ్యూనిస్టు పార్టీలతో చర్చల్లో ఉన్నామంటూ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ లీకులు ఇస్తో వస్తోంది. కమ్యూనిస్టు పార్టీల సహకారంతో వచ్చే ఎన్నికల్లో వెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ గా తెలుస్తోంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ షాక్ ఇచ్చిందో అప్పటి నుంచి వామపక్షాలపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

మరోవైపు.. కమ్యూనిస్టులు ఇండియా కూటమిలో ఉన్నారు. ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ ఏమీ లేదు. కానీ.. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా వామపక్షాలు బీఆర్ఎస్ తో కలిసి పని చేశాయి. అప్పుడే తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా ఉన్న విషయం తెలిసిందే. 

మరోవైపు.. పొత్తులపై వామపక్షాలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. తమకు ఎవరూ ఫోన్ చేయలేదని, తాము ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ చర్చలు జరపలేదని వామపక్షాల నాయకులు చెబుతున్నారు. సీపీఎం వాళ్లు మాత్రం తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకెళ్తామంటున్నారు. సీపీఐ వాళ్లు మాత్రం 4 సీట్లు అడిగినట్లు తెలుస్తోంది. సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీలోనూ చాలామంది అశావాహులు ఉన్నారు. వామపక్షాలు అడుగుతున్న సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా..? లేదా... అనే తేలాల్సి ఉంది.