
హైదరాబాద్, వెలుగు: వడ్లు కొనేందుకు రాష్ట్ర సర్కార్‌కు చేతకాకపోతే కాంగ్రెస్ పార్టీకి రూ.10 వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ మేమే కొంటామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర సర్కార్ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందని చెప్పారు. సోమవారం గాంధీ భవన్లో చిన్నారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని చిన్నారెడ్డి విమర్శించారు. ఉప్పుడు బియ్యం(బాయిల్డ్ రైస్) జనాలు తినకపోవడం వల్ల అవి వద్దని, సాధారణ బియ్యం(రా రైస్) ఎంత ఇచ్చినా తీసుకుంటామని కేంద్రం చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వడ్లు కొనేదాకా రాష్ట్ర సర్కార్‌పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. అందుకు మండల, జిల్లా ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇవ్వడం, అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు, సభలు, సమావేశాలు, ఫ్లెక్సీల ఏర్పాటు వంటివి చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. వారం రోజుల్లో వడ్ల కొనుగోలుకు ఏర్పాట్లు చేయకపోతే కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిస్తామని అన్వేష్‌రెడ్డి హెచ్చరించారు. వరి అంటే ఉరి అని కేసీఆర్ మాట్లాడటం వల్ల రాష్ట్రంలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పండిన వడ్లను ఎవరు కొంటరో వారే రైతుల వడ్లను కూడా కొనాలన్నారు.