మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు నోట్ల ఎన్నిక

మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు నోట్ల ఎన్నిక

కామారెడ్డి, వెలుగు: మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదని, అది నోట్ల ఎన్నిక అని.. ఉప ఎన్నికల ఫలితంపై తాము ఏమాత్రం చింతించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లారా సమీపంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడం కామన్. ప్రజల తీర్పును తాము శిరసావహిస్తం, ఫలితంపై ఆత్మ పరిశీల న చేసుకుంటం. ఇతర రాష్ట్రాల్లో మాకు బీజేపీ మాత్రమే ప్రత్యర్థి, తెలంగాణలో మాత్రం బీజేపీ, టీఆర్ఎస్​, ఎంఐఎం ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నరు. ఇద్దరు కోటీశ్వరులైన అభ్యర్థులతో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బాగా పోరాడారు”అని అన్నారు. మునుగోడు దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్షన్​గా మిగిలిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని మర్డర్​ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని చెప్పా రు. దేశమంతా ఆహార భద్రత కోసం ఆలోచిస్తుంటే తెలంగాణ సర్కార్ లిక్కర్ భద్రత కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు.

రాష్ట్రంలో జోడో యాత్రకు విశేష స్పందన

భారత్ జోడో యాత్రకు తెలంగాణలో విశేష స్పందన వచ్చిందని జైరాం ​అన్నారు. పదకొండున్నర రోజులు  319 కి.మీ., 8 జిల్లాల్లో సాగిందని చెప్పారు. సోమవారం రాత్రి మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందన్నారు. ‘‘భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు, ఐక్య భారత్ కోసం. మన్ కీ బాత్ ప్రోగ్రాం కాదు, ప్రజల గోడును తెలుసుకునే యాత్ర. ఈ యాత్ర తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్​లో ఉత్తేజాన్ని నింపింది. పార్టీలో ఎవరు లక్ష్మణరేఖ దాటినా చర్యలు తప్పవు. ఇప్పటికే వెంకటరెడ్డికి నోటీసులు ఇచ్చాం, సమాధానం రాకపోతే చర్యలు తప్పవు” అని అన్నారు.