విద్యను ప్రైవేటుపరం చేస్తున్నడు: రాహుల్​

విద్యను ప్రైవేటుపరం చేస్తున్నడు: రాహుల్​

మహబూబ్​నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు : తెలంగాణలోని యువత ఆకాంక్షలను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నరని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. విద్యా వ్యవస్థను ప్రైవేటుపరం చేస్తూ పేదలకు చదువును దూరం చేస్తున్నరని విమర్శించారు. ‘భారత్ జోడో’ యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్​నగర్ జిల్లా ధర్మాపూర్​ మండలం నుంచి ప్రారంభమై.. సాయంత్రం 7గంటలకు జడ్చర్ల మండలం గొలపల్లి దగ్గరున్న లలితాంబిక టెంపుల్​కు చేరుకుంది. సాయంత్రం జడ్చర్ల ఫ్లైఓవర్​ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో రాహుల్​ మాట్లాడారు.  బడ్జెట్​లో కేసీఆర్​ ప్రభుత్వం విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయిస్తున్నదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే భారీగా నిధులు కేటాయిస్తామని, అప్పుడు స్టూడెంట్లు, వారి కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పారు. ‘‘ఈ రోజు నేను ఓ యువకుడిని కలిశాను. అతను మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడు. రాష్ర్ట ప్రభుత్వం రీయింబర్స్​మెంట్ ఇవ్వకపోవడంతో మధ్యలోనే చదువు మానేసి జొమాటోలో డెలివరీ బాయ్​గా పని చేస్తున్నాడు”అని రాహుల్​ చెప్పారు. 

మేము అధికారంలోకొస్తే పరిహారం ఇస్తం

రాష్ర్ట ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నదని రాహుల్​ విమర్శించారు. వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. దేశంలో చేనేత వస్ర్తాలకు మంచి గుర్తింపు ఉందన్నారు. లక్ష మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 12శాతం జీఎస్టీతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇండియాను బీజేపీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నదని రాహుల్​ ఆరోపించారు. పేదల డబ్బును కార్పొరేట్​ చేతుల్లో పెడుతున్నదని విమర్శించారు. బీజేపీ, టీఆర్​ఎస్​లు బిజినెస్​ పార్టీలు అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, దిగ్విజయ్​ సింగ్, టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మధు యాష్కీ, మహేశ్​గౌడ్, జనంపల్లి అనిరుధ్​రెడ్డి పాల్గొన్నారు.

‘పాలమూరు-రంగారెడ్డి’పై రాహుల్​ ఆరా

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి రాహుల్​ ఆరా తీశారు. ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి గల కారణాలను ‘పాలమూరు అధ్యయన వేదిక’ అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్, ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ రాఘావచారిని అడిగి తెలుసుకున్నారు. లంచ్​ అవర్​లో వారితో సమావేశం అయ్యారు. 8ఏండ్లలో 30శాతం పనులు కూడా కంప్లీట్ కాలేదని వేదిక నేతలు రాహుల్​కు వివరించారు. సాగునీరు లేక ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కోయిల్​కొండ, గండీడ్, మహ్మదాబాద్, మద్దూరు తదితర ఏరియాల నుంచి లక్షల మంది వలస పోతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అధ్యయన వేదిక రూపొందించిన కరపత్రాన్ని రాహుల్​కు అందజేశారు. 

పాదయాత్రలో నటి పూనమ్​ కౌర్​

యాత్రలో భాగంగా రాహుల్​గాంధీతో సినీ నటి పూనమ్​కౌర్​ భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో చేనేత కార్మికుల ఇబ్బందులను రాహుల్​ దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కార్మికులను కళాకారులుగా గుర్తించాలని కోరారు. చేనేత సమస్యలను పార్లమెంట్​లో ప్రస్తావించాలని కోరినట్టు పూనమ్​ కౌర్​ మీడియా పాయింట్​లో వెల్లడించారు. హ్యాండ్లూమ్​పై విధించిన జీఎస్​టీతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వ్యాపారాలు చేసుకోలేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. జీఎస్టీ ఎత్తేయాలని కోరుతూ 66మంది ఎంపీలను కలిసినట్టు వివరించారు. దీనికి మద్దతుగా వారి నుంచి సంతకాలు సేకరించినట్టు వివరించారు.