
- అసలు విషయం దాచి అబద్ధాలు చెప్పొద్దు
- కేటీఆర్, హరీశ్‌రావుపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరేనని కామెంట్
హైదరాబాద్, వెలుగు: చెల్లె కవిత బెయిల్ కోసం కేటీఆర్.. ఢిల్లీ గల్లీల్లో తిరుగుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తిహార్ జైల్లో చెల్లెతో ములాఖత్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన, పెద్ద.. పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. కవితను బయటకు తీసుకొచ్చేందుకు అడ్వకేట్లతో చర్చిస్తున్నామని కేటీఆర్, హరీశ్ రావు చెప్తే బాగుండేదని పేర్కొన్నారు. అసలు విషయం దాచి.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకు వెళ్తున్నం అని చెప్పడం సరికాదని విమర్శించారు. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామంటూ బీఆర్ఎస్ లీడర్లు అంటున్నరని ఎద్దేవా చేశారు.
‘‘కవిత బెయిల్ కోసం ఢిల్లీలో చక్కర్లు కొట్టుకోండి. కానీ.. రాజ్యాంగం కోసమని మాత్రం చెప్పకండి. ఫిరాయింపులపై బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లు ఎందుకు నోరు మెదపలేదు?’’అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘‘ఢిల్లీకి మీతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు అసలు మీ పార్టీలో ఉంటారో.. లేదో.. చూస్కోండి. కేటీఆర్, హరీశ్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉండరు. అసెంబ్లీ సమావేశాలకు రాని ప్రతిపక్ష నేతపై బీఆర్ఎస్ నాయకుల్లోనే విశ్వాసం పోయింది. ఉప ఎన్నికలు వస్తాయంటూ పెద్ద పెద్ద మాటాలు వద్దు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రజలు మీకే బుద్ధి చెప్తరు’’అంటూ శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.