జైపూర్(భీమారం), వెలుగు: ప్రజలు తిరస్కరించినా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు ఇంకా బుద్ధి రాలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంగళవారం భీమారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. మంత్రి వివేక్వెంకటస్వామిపై బాల్క సుమన్ చేసిన అనుచిత వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీనియర్ నేత పొడేటి రవి మాట్లాడుతూ.. బాల్క సుమన్ ను ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించి తిప్పికొట్టినా ఇంకా బుద్ధిరాలేదన్నారు.
రాజకీయ పబ్బం గడుపుకునేందుకే బీఆర్ఎస్ నేతలు మంత్రి వివేక్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి వివేక్ సౌమ్యుడని, సుమన్ లాంటి అవినీతి పరుడు కాదన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి వందల కోట్ల నిధులు తెచ్చి మంత్రి వివేక్ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవుపలికారు. సమావేశంలో సర్పంచులు వీరయ్య, మల్లేశ్, కొమురయ్య యాదవ్, లీడర్లు భూక్య లక్ష్మణ్, యు.శ్రీనివాస్, పి.చందు, వి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

