రోజు మంచినీటి సరఫరా ఏమైంది కేటీఆర్ సార్

రోజు మంచినీటి సరఫరా ఏమైంది కేటీఆర్ సార్

ఉప్పల్ లో ప్రజలు ఎదుర్కొంటున్న మంచి నీటి సమస్యపై కాంగ్రెస్ పోరాటం చేపట్టింది. ఉప్పల్ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఉప్పల్ వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కార్యాలయం ఎదుట నేతలు ఆందోళన చేపట్టారు. ఖాళీ కుండలతో తమ నిరసన వ్యక్తం చేశారు. రోజు మంచినీటి సరఫరా ఏమైంది కేటీఆర్ సార్.. అనే బ్యానర్ లు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వాటర్ వర్క్స్ అధికారితో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మంచి నీటి ఎద్దడి, కలుషిత నీటి సరఫరా, లోఫ్రెషర్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటూ.. డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా చేపట్టారు. ఉప్పల్ ప్రజల సమస్యలు తీర్చడంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి విఫలమయ్యారని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి విమర్శించారు. గతంలో జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల ముందు మంచినీటి సరఫరా చేస్తేనే ఓట్లు అడుగుతామని ప్రగల్బాలు  పలికి ఇప్పుడు ఆ హామీ అమలు చేయడంలో విఫలం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రజలకు స్వచ్ఛమైన నీరును రోజు విడిచి రోజు అందించాలని లేనిపక్షంలో ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయని హెచ్చరించారు. పట్టణ ప్రగతి పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు ఫొటోలకు ఫోజులివ్వడమే కానీ ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని ఉప్పల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి విమర్శించారు. రోజు విడిచి రోజు మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.