- కేటీఆర్, హరీశ్‌కు బల్మూరి వెంకట్ సవాల్
హైదరాబాద్, వెలుగు: బాకీ కార్డుల పేరుతో రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. వారికి దమ్ముంటే పదేండ్ల గత బీఆర్‌ఎస్ పాలనపై, రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బావా, బామ్మర్థులు ఇద్దరికి బాకీ కార్డుల విషయంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా.. దమ్ము, ధైర్యం ఉన్నా తన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని స్పష్టం చేశారు.
చర్చ ఎప్పుడు, ఎక్కడ పెట్టినా తాను రెడీ అని తెలిపారు. సొంత కుటుంబంలోని సమస్యను పరిష్కరించలేనివారు ప్రజా సమస్యలను ఏం పరిష్కరిస్తారని కేటీఆర్, హరీశ్ లను బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. బాకీ కార్డులంటూ హడావుడి చేస్తున్న బీఆర్ఎస్ నేతలు..వారి పదేండ్ల పాలనలో బాకీపడ్డ హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఫైర్ అయ్యారు. ఎన్ని జిమిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్సేనని చెప్పారు. బీఆర్ఎస్ ను తెలంగాణ జనం మరిచిపోయారని వెంకట్ పేర్కొన్నారు.
