
హైదరాబాద్, వెలుగు: కొల్లాపూర్ ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని, అక్కడి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. ఆయన ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్పీ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయన్నారు.
నాగర్కర్నూల్లో ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయన్నారు. అలంపూర్లో మాత్రం ఈవీఎంను పగలగొట్టేందుకు బీఆర్ఎస్ నేత ప్రయత్నించాడని ఆరోపించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి జూపల్లి కొల్లాపూర్ లో బుల్డోజర్ పెట్టి ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమన్నారు.
గువ్వల బెదిరించిన విషయం మరిచారా?
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఆర్ఎస్పీని బెదిరించారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ పీ మొదట బీఎస్పీలో చేరినప్పుడు ప్రజలు సంతోషించారని, కానీ చివరకు దొర కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆయన బీఆర్ఎస్ లో చేరారని అన్నారు.బీఆర్ఎస్ లో చేరికతో ఆర్ఎస్ పీ క్యారెక్టర్ వంద నుంచి పదికి పడిపోయిందన్నారు.