గువాహటి: పొలిటికల్ లీడర్ల కుటుంబాలపై రాజకీయ విమర్శలతో దాడులు చేయడం అనైతికమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపించడం, గొగోయ్ కుటుంబాన్ని, పిల్లలను అందులోకి లాగడం తప్పని అన్నారు. ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు మాని వచ్చే ఐదేండ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలని సీఎం హిమంత బిశ్వ శర్మను ప్రశ్నించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థుల జాబితా స్క్రీనింగ్, ఫైనలైజేషన్ కోసం ప్రియాంక గురువారం అస్సాం చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీల నాయకులు, సీనియర్ ఫంక్షనరీలతో మీటింగ్స్ నిర్వహించి, ఫీడ్‌బ్యాక్ సేకరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె రెండు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గువాహటిలో మీడియాతో మాట్లాడారు.
"సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఆయన రాష్ట్ర ఆస్తులను, భూములను ఒకే కుటుంబానికి, పెద్ద పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తున్నారు. అస్సాం ఆస్తులు, భూములు ఇక్కడి ప్రజలవే. వాటిని బడా వ్యాపారులకు ఎందుకు ఇస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రాష్ట్రంలో మార్పుకు సమయం వచ్చిందని గుర్తిస్తున్నారు" అని పేర్కొన్నారు. అస్సాంలో అవినీతి పెరిగిందని.. రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్నదని ఆరోపించారు.
తప్పుడు రాజకీయాలొద్దు
అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్ తో సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు. ఆయన కుటుంబం, పిల్లలపై విమర్శలతో దాడులు చేయడం తప్పుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. గౌరవ్ గొగోయ్ లవ్ పాలిటిక్స్ చేస్తున్నారని.. అందుకే దాడులు జరుగుతున్నాయని చెప్పారు. గౌరవ్ నిజాయితీని చూసి పాలక పార్టీ భయపడుతోందన్నారు.
