మున్సిపల్​ స్థలాలను పరిశీలించిన ఎంపీ ఉత్తమ్

మున్సిపల్​ స్థలాలను పరిశీలించిన ఎంపీ ఉత్తమ్

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, అటవీ, పోడు, మున్సిపల్, గ్రామ పంచాయితీ లే అవుట్ భూములను టీఆర్ఎస్ లీడర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై కబ్జా చేస్తున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కబ్జాకు గురైన మున్సిపల్ స్థలాలను స్థానిక నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హుజూర్ నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నపుడు లే అవుట్ ల్లో పంచాయతీకి ఇచ్చిన స్థలాలు రూ. కోట్లకు చేరాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అనుచరులతో కలిసి ఆ స్థలాలను కబ్జా చేస్తున్నారని అన్నారు. సాయిబాబా థియేటర్ పక్కన ఉన్న ఓ వెంచర్ లోని 5,500 గజాల భూమి, వీపీఆర్ వెంచర్ లో 3,200 గజాలకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం చేశారని, మున్సిపల్ అధికారుల లాగిన్ దొంగలించి వివరాలు మార్చారని చెప్పారు.

పద్మశాలి భవన్ పక్కన ఉన్న 2,440 గజాల భూమిని మున్సిపల్ చైర్​పర్సన్​మామ పేరుతో రిజిస్టర్ చేశారని చెప్పారు. జనరల్ బాడీ సమావేశం నిర్వహించకుండా అత్యవసర పనుల పేరుతో కోట్ల రూపాయలు పనులు చేయకుండానే లూటీ చేస్తున్నారన్నారు. వార్డుల్లోఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. హుజూర్ నగర్ సీఐ టీఆర్ఎస్​కార్యకర్తల్లా  పని చేస్తున్నాడని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా శుక్రవారం మున్సిపల్​ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు.