పార్లమెంట్ ముందు నల్ల దుస్తుల్లో విపక్షాల నిరసన

పార్లమెంట్ ముందు నల్ల దుస్తుల్లో విపక్షాల నిరసన

ఢిల్లీ: NEET పేపర్ లీక్పై కేంద్ర బాధ్యతారాహిత్య ధోరణి, కాక్రోచ్ పార్టీ నిరసనకారులపై, విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ను ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. నల్ల దుస్తులు ధరించి పేపర్ లీకులు, విద్యార్థులపై పోలీసుల దాడి నిరసిస్తూ పెద్ద పల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరసన తెలిపారు.

విద్యా విధానంలో లోపాలు, పేపర్ లీకులు, విద్యార్థులపై పోలీసుల దాడి గురించి పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్‌‌కు నిరసనగా.. మంగళవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ నివాసం ఎదుట ప్రతిప‌‌క్ష నేత‌‌లు మెరుపు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.

భారీగా మోహరించిన పోలీసులు.. రాహుల్‌‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సహా ఇతర నేతలందరినీ బలవంతంగా అరెస్ట్ చేసి, బస్సులో తరలించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌‌ర్మేంద్ర ప్రధాన్‌‌ను తొల‌‌గించాల్సిందేన‌‌ని నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రధాని నివాసం ముందు పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను మోహరించారు.

ప్రధాని ఇంటి ముందు ధర్నా సమయంలో  పోలీసులు బలవంతంగా లాక్కెళ్లిన సందర్భంగా జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి స్వల్పంగా రక్తం కారింది. రాహుల్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్తూ, వాహనంలోకి ఎక్కించే సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసుల నెట్టివేత, బలప్రయోగంలో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు గాయం కావడం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత పట్ల పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని మండిపడ్డారు.

ALSO READ : ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడి..