- సీనియర్, జూనియర్ కాంబోలో ఎంపిక.. ఇయ్యాల నామినేషన్లు
- బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు.. రాష్ట్రంలోని మూడు స్థానాలు ఏకగ్రీవం!
హైదరాబాద్, వెలుగు : రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. సీనియర్, జూనియర్ కాంబోలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి.. సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతకు అవకాశమిచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు రాజ్యసభకూ అదే ఫార్ములా అనుసరించింది. యువతను ప్రోత్సహించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు అనిల్‌కుమార్‌కు అవకాశం కల్పించింది. ఇక కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవమున్న రేణుకా చౌదరిని మరో సీటుకు ఎంపిక చేసింది. నిజానికి ఒక సీటు రాష్ట్ర లీడర్‌కు, మరొకటి జాతీయ స్థాయి నేతకు ఇస్తారని చర్చ జరగ్గా.. రెండింటినీ రాష్ట్ర నేతలకే హైకమాండ్ కేటాయించింది. కాగా, గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. గురువారం మధ్యాహ్నం అసెంబ్లీలో రేణుక, అనిల్ నామినేషన్లు వేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
సీనియర్ల పేర్లు వినిపించినా..
రాజ్యసభకు మొదట చాలామంది సీనియర్ల పేర్లు వినిపించాయి. జానారెడ్డితో పాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. లోక్‌సభ టికెట్‌కు అప్లై చేసుకున్న వీహెచ్ పేరును కూడా హైకమాండ్ పరిశీలించింది. అనిల్‌కుమార్ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ కూ అవకాశం దక్కొచ్చన్న చర్చ జరిగింది. అయితే చివరి వరకు ఎవరి నోటీసులోనూ లేని 41 ఏండ్ల అనిల్ కుమార్ యాదవ్‌ను నామినేట్చేసి కాంగ్రెస్హైకమాండ్ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీ భవిష్యత్అవసరాలను దృష్టిలో పెట్టుకునే యువ నేతకు అవకాశం కల్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యాదవ కమ్యూనిటీ ఓట్లనూ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. సిటీలో యాదవుల పాపులేషన్ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్స్థానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేయొచ్చన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనికి తోడు సీఎం రేవంత్ సన్నిహితుడిగానూ అనిల్‌కు పేరుంది.
సీనియర్ లీడర్ రేణుక..
రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానానికి అప్లై కూడా చేసుకున్నారు. అయితే సీనియర్అయిన ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తే, ఖమ్మం నుంచి మరో సీనియర్ నేతకు లైన్ క్లియర్ చేయొచ్చన్న భావనతో రేణుకను రాజ్యసభకు నామినేట్చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఖమ్మం లోక్‌సభ స్థానం హాట్‌సీట్‌గా మారిన నేపథ్యంలో రేణుకకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా హైకమాండ్పోటీని తగ్గించింది. ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ పోటీ పడుతున్నారు. కాగా, 1997 నుంచి 1998 వరకు దేవెగౌడ కేబినెట్లో, యూపీఏ హయంలో కేంద్రమంత్రిగా రేణుక పని చేశారు. 1984లో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. 1998లో కాంగ్రెస్‌లో చేరారు.
రెజ్లర్ అనిల్..
ఎన్ఎస్యూఐతో పాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్.. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1999లో ఎన్ఎస్యూఐలో చేరి పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయనకు స్పోర్ట్స్‌లోనూ అనుభవమున్నది. జాతీయ, రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐకి నేషనల్ కో ఆర్డినేటర్‌గా, 2015 నుంచి 2020 వరకు యూత్ కాంగ్రెస్అధ్యక్షుడిగా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అనిల్‌కు అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ లోని యాదవ వర్గం నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే యాదవులకు గుర్తింపు ఉంటుందని, యాదవ సామాజికవర్గం కాంగ్రెస్‌కు అండగా ఉండాలని పీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్కోరారు. కాగా, తనను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.
మూడు స్థానాలూ ఏకగ్రీవమే!
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్‌ల పదవీ కాలం పూర్తవడంతో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒకటి దక్కనున్నాయి. అయితే మూడో సీటు కోసం కాంగ్రెస్మరో అభ్యర్థిని నిలిపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ జరగ్గా, దానికి హైకమాండ్ఫుల్ స్టాప్ పెట్టింది. కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించి ఉంటే, ఎన్నిక అనివార్యమై ఉండేది. కానీ ఇద్దరినే నామినేట్చేయడంతో ఎన్నిక తప్పినట్టయింది.

