ఏ రెండు సీట్లు ఇస్తరో?.. లెఫ్ట్ పార్టీ నేతల్లో ఉత్కంఠ

 ఏ రెండు సీట్లు ఇస్తరో?.. లెఫ్ట్ పార్టీ నేతల్లో ఉత్కంఠ

కాంగ్రెస్​తో పొత్తుపై  నేడు స్పష్టత వచ్చే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదివా రం ఫస్ట్ ఫేజ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో  లెఫ్ట్ పార్టీలతో పొత్తుపై కూడా క్లారిటీ రానున్నది. ఇప్పటికే సీపీఎం, సీపీఐ పార్టీలకు తలో రెండు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏ రెండు సీట్లు ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. దీంతో లెఫ్ట్ నేతల్లో ఉత్కంఠ నెలకొన్నది. కాంగ్రెస్, లెఫ్ట్ నేతల మధ్య దాదాపు నెలరోజులకు పైగా అడపాదడపా చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ  పొత్తులపై, పోటీ చేసే స్థానాలపై క్లారిటీ రాలేదు. దాంతో ఓ దశలో పొత్తు ఉంటుందా? లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. 

ఇవే కీలకమా..!

సీపీఐకి మునుగోడు దాదాపు ఫైనల్ కాగా.. మరో సీటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ స్థానంపై స్పష్టత రాగా, మరో సీటు ఏంటో తేలలేదు. లెఫ్ట్ పార్టీ నేతలతో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పలుమార్లు ఫోన్లలో చర్చలు జరిపారు. సీపీఎం, సీపీఐ అడుగుతున్న రెండో సీట్లల్లో  కొత్తగూడెం, భద్రాచలం, పాలేరు కీలకంగా ఉన్నాయి. అయితే సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మినహా మిగిలిన చోట తీసుకోవాలని కాంగ్రెస్ తాజాగా ఓప్రతిపాదన తెచ్చినట్టు తెలిసింది. దీనిపై ఆపార్టీ నేతల్లో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. 

సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం సీటు కోసం,  సీపీఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం పాలేరు స్థానం కోసం పట్టుపడుతున్నారు. ఈ రెండు స్థానాల్లో వారే పోటీలో ఉండాలని నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ ఆ స్థానాలను కేటాయిస్తుందా  లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది. పాలేరు ఇవ్వకపోతే, భద్రాచలం ఇవ్వాలని సీపీఎం  నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే లెఫ్ట్ నేతలతో పొత్తుల అంశం జాతీయ స్థాయిలోనే జరుగుతుండటంతో, ప్రకటన వెలువడేదాకా సీట్లపై స్పష్టత  వచ్చే అవకాశం లేదని రాష్ట్ర నేతలు పేర్కొన్నారు.