నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్స్

నేడు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్స్
  • ఇయ్యాల ఢిల్లీకి రాష్ట్ర ముఖ్య నేతలు
  • టికెట్ దక్కనోళ్లను ముందుగానే ఢిల్లీకి పిలిచి బుజ్జగింపులు

హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ ఫైనల్ స్టేజ్‌‌‌‌కు చేరుకుంది. ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం పార్టీ స్క్రీనింగ్ కమిటీ, సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ముఖ్య నేతలు మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్తారు. మరోవైపు సెకండ్ జాబితాలో టికెట్ ఖరారు కాని నేతలను‌‌‌‌ ముందుగానే ఢిల్లీకి పిలిపించుకుని హైకమాండ్ చర్చలు జరుపుతున్నది. జానారెడ్డి, ఠాక్రే వంటి సీనియర్లతో బుజ్జగింపుల కమిటీని వేసినా.. ఫస్ట్ లిస్ట్‌‌‌‌లో టికెట్ రాని లీడర్లను ఆ కమిటీ లీడర్లు సముదాయించలేకపోయారు. ఈ విషయంలో ఆ కమిటీ ఫెయిల్ అయిందన్న భావనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. స్వయంగా రంగంలోకి దిగారు. పాలేరు టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు, ఖమ్మం డీసీసీ ప్రెసిడెంట్ మహ్మద్ జావెద్‌‌‌‌ ను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుజ్జగించినట్టు తెలిసింది. సీఈసీ భేటీ తర్వాత మిగతా 64 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు.

మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌కు పిలుపు..

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌ను హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిచారు. ఆయన నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనతో పాటు డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ టికెట్ రేసులో ఉన్నారు. సంజయ్‌‌‌‌కు టికెట్ ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో మహేశ్‌‌‌‌ను ఢిల్లీకి పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  సీఈసీ సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.  

లెఫ్ట్ పార్టీల సీట్లపై క్లారిటీ..

ఈ నెల 15న 55 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇటీవల పార్టీ స్ర్కీనింగ్ కమిటీ రెండుసార్లు భేటీ అయి, మిగతా 64 సీట్లకు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసింది. ఇందులో లెఫ్ట్ పార్టీలకు కేటాయించే నాలుగు సీట్లు, మిగిలిన 60 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఈ లిస్టుపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరుల సమక్షంలో జరిగే సీఈసీ మీటింగ్ లో చర్చించనున్నారు. సీఈసీ ఆమోదించే అభ్యర్థుల లిస్టును గురువారం విడుదల చేసే అవకాశం ఉంది. కాగా రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు.. బుధవారం కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలిసింది. పార్టీలో చేరనున్న వీళ్ల కోసం 4 నుంచి 5 స్థానాలను కేటాయించనున్నట్లు సమాచారం.