
- గాంధీభవన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు
- కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది: రేవంత్
- ఇంట్లో కూర్చుంటే కుదరదు.. అందరూ బయటకొచ్చి పోరాడాలి: ఠాక్రే
- మాజీ కార్పొరేటర్లు, కార్పొరేటర్లతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిరసన దీక్ష చేపట్టనుంది. హైదరాబాద్ గాంధీభవన్‌లోని గాంధీవిగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలంతా దీక్ష చేయనున్నారు. కాగా, రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు రాహుల్‌కు మద్దతు తెలపడం, అదానీ అంశంపై నిలదీస్తుండడంతో మోడీ ప్రభుత్వం తట్టుకోలేకపోతున్నదని విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎక్స్కార్పొరేటర్లతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ గట్టిగా పోరాడుతున్నదని, అందుకే కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నదని మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించే దీక్షలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.
కలిసికట్టుగా పోరాడాలి: ఠాక్రే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ శ్రేణులు కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేమీ ఉండదని, అందరూ బయటకొచ్చి పోరాడాలని ఆయన సూచించారు. ప్రత్యక్ష పోరాటాలతో పాటు సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అనర్హత వేటు వేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిస్తున్నదని
ఆరోపించారు.
అణచివేత రాజకీయాలపై పోరాడండి
రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే సూచన
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు న ఖర్గే శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. కర్ణాటకలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఢిల్లీకి తిరు గు ప్రయాణంలో భాగంగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో కలిసి హైదరాబాద్‌లో దిగారు. ఈ సందర్భంగా ఖర్గే, శివకుమార్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ ఉత్తమ్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ తదితరులు రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోనే వారితో ఖర్గే భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీపై అనర్హత తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు హాత్ సే హాత్ జోడో యాత్ర సాగుతున్న తీరు గురించి ఖర్గే ఆరా తీశారు. బీజేపీ అణచివేత రాజకీయాలకు దిగుతున్నదని, దీనిపై క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు చేయాల్సిందిగా కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఖర్గేకు రేవంత్ వివరించారు. రెండు రోజులుగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలను చెప్పారు. ఇప్పటిదాకా 31 నియోజకవర్గాల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర చేశానని, ప్రజల నుంచి స్పందన బాగుందని రేవంత్ తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరీ, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.