
హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్ కు వచ్చారు. ఇవాళ, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ రూట్ మ్యాప్ పై పార్టీలోని సీనియర్ నాయకులతో సమీక్ష చేయనున్నారు. ఇవాళ మక్తల్ నుంచి హైదరాబాద్ వరకూ రూట్ మ్యాప్ ను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పార్టీ ముఖ్యనేతలతో ఠాగూర్ సమావేశంకానున్నారు. రేపు హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకూ రూట్ మ్యాప్ ను పరిశీలించనున్నారు. మరోవైపు రేపు హైదరాబాద్ కు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. పార్టీ ముఖ్యనాయకులతో కేసీ వేణుగోపాల్, ఠాగూర్ సమావేశంకానున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్ర దుర్గలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో యాత్ర పూర్తైన తర్వాత సెప్టెంబర్ 30న రాహుల్ యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. చల్లకెరె గ్రామం నుంచి ఇవాళ రాహుల్ తన పాదయాత్ర ప్రారంభించారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర ఇప్పటివరకు 905 కిలోమీటర్ల మైలురాయి దాటింది.
ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర త్వరలోనే తెలంగాణలో ఎంటర్ కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనున్న రాహుల్ గాంధీ పాదయాత్ర జమ్మూకశ్మీర్ లో ముగియనుంది.