- కాంగ్రెస్ నిరుద్యోగ నిరసనల తేదీల్లో మార్పు
- నల్గొండ సభ 28వ తేదీకి వాయిదా
- 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, మే 1న రంగారెడ్డి జిల్లాల్లో సభలు
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగ నిరసన దీక్షల తేదీలను కాంగ్రెస్ పార్టీ రీషెడ్యూల్ చేసింది. సవరించిన షెడ్యూల్‌ను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం ప్రకటించారు. ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్గొండ, మే 1వ తేదీన రంగారెడ్డి జిల్లాల్లో నిరసన ర్యాలీలు, సభలను నిర్వహించనున్నారు. ఆ సభల్లో ఆయా జిల్లాలకు చెందిన నేతలతోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ వివిధ విభాగాల చైర్మన్లు, డీసీసీ ప్రెసిడెంట్లు పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాల్లో నిరసన దీక్షలకు ఏర్పాట్లు, నేతలకు సమాచారం ఇచ్చే బాధ్యతలను డీసీసీ ప్రెసిడెంట్లే చూసుకోవాలని జారీ చేసిన సర్క్యులర్‌లో వెల్లడించారు. కాగా, నల్గొండ సభకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నల్గొండ ఎంజీ వర్సిటీలో శుక్రవారం సభను నిర్వహించాల్సి ఉన్నా.. ఉత్తమ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తేదీని మార్చారు.
రేణుకా చౌదరి ఇంట్లో కీలక భేటీ
నిరుద్యోగ నిరసన దీక్షలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఇంట్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభపై చర్చించారు. అయితే, ఆ తేదీన తనకు వేరే పనులున్నాయని, తాను రాలేనని రేణుక చెప్పినట్టు సమాచారం. తమ కార్యకర్తలు, అనుచరులను పంపిస్తానని ఆమె తెలిపినట్టు తెలుస్తున్నది. దాంతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపైనా రేణుకా చౌదరితో నేతలు చర్చించినట్టు తెలుస్తున్నది. పొంగులేటి పార్టీలోకి వచ్చేలా చొరవ తీసుకోవాల్సిందిగా ఆమెను కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, బలరాం నాయక్, సురేశ్ షెట్కర్, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

