గ్రేటర్వరంగల్/ హసన్‌పర్తి, వెలుగు: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో శనివారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయ్ మార్చ్ (క్యాండిల్ లైట్ ర్యాలీ) నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ఇది దేశవ్యాప్తంగా విద్యార్థులు సాగించిన పోరాటానికి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వానికి దక్కిన నైతిక విజయమన్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రేవూరి ప్రకాశ్‌రెడ్డి మద్దతు తెలిపారు. అదేవిధంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
