- బీజేపీ, బీఆర్ఎస్కు తగ్గింది
- అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిన తేడా
కరీంనగర్, వెలుగు: 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు పర్సంటేజీతో చూస్తే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు తగ్గిపోగా.. కాంగ్రెస్ కు పెరగడం విశేషం. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్(బీఆర్ఎస్)కు 40.12 శాతం, బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి బండి సంజయ్ కి 38.74 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కు 17.43 శాతం ఓట్లు వచ్చాయి. తాజాగా పార్టీల గుర్తుల మీద జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓటు షేర్ లో తేడా స్పష్టంగా కనిపించింది.
పోలైన ఓట్లు 2,06,483
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో మొత్తం 2,06,483 ఓట్లు పోలయ్యాయి. ఆయా డివిజన్లలో కలిపి బీజేపీ అభ్యర్థులకు 62,025(30 శాతం) ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 8.74 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థులకు 46,324 ఓట్లు (22.43 శాతం) మాత్రమే వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే ఒక్కసారిగా 18 శాతం తగ్గిపోయాయి.
65 డివిజన్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కు 48,969 ఓట్లు (24 శాతం) వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓటు షేర్ తో పోలిస్తే ఈ ఎన్నికల్లో 6 శాతం పెరిగింది. ఏఐఎఫ్ బీకి 31 వార్డుల్లో కలిపి 5,168 ఓట్లు రాగా, 15 డివిజన్లలో పోటీ చేసిన ఎంఐఎంకు 13,485 ఓట్లు వచ్చాయి.
