బడ్జెట్లో నిధులపై అసెంబ్లీలో రచ్చ

బడ్జెట్లో నిధులపై అసెంబ్లీలో రచ్చ
  • సంక్షేమానికి ఫండ్స్ ఎందుకు తగ్గించారు: మహేశ్వర్​ రెడ్డి 
  • కేంద్రం నుంచి కనీస సహకారం లేదన్న మంత్రులు సీతక్క, 
  • పొన్నం, శ్రీధర్​బాబు
  •     8 మంది ఎంపీలు తెలంగాణకు ప్రత్యేకంగా ఏం తెచ్చారని నిలదీత
  •     ఆంధ్రావాళ్లు నిధులు తీసుకెళ్తే కళ్లప్పగించి చూస్తున్నారని ఫైర్
  •     కాంగ్రెస్ ది చీటింగ్ బడ్జెట్ అన్న మహేశ్వర్ రెడ్డి
  •     10 నెలల కాగ్​లెక్కలతో బండారం బయటపడిందని వెల్లడి
  •     1.38 లక్షల ఆదాయాన్ని రూ.2.04 లక్షలుగా ఎలా చూపిస్తారని ప్రశ్న
  •     చీటింగ్ బడ్జెట్ అనడాన్ని ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు
  •     చీటింగ్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తామన్న స్పీకర్
  •     అసెంబ్లీలో గంటన్నరకు పైగా వాడివేడి చర్చ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో బడ్జెట్​పై మంగళవారం బీజేపీ, కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సంక్షేమానికి నిధులు ఎందుకు తగ్గించారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి ప్రశ్నించగా.. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్​, శ్రీధర్​బాబు ఎదురుదాడికి దిగారు. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు ప్రత్యేకంగా ఏం తెచ్చారని నిలదీశారు. ఆంధ్రావాళ్లు నిధులు తీసుకెళ్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారని ఫైర్ అయ్యారు​. కాగ్​ రిపోర్ట్​ ప్రకారం 10 నెలల్లో రెవెన్యూ వసూళ్లు కేవలం 60 శాతం మాత్రమేనని, రెండు నెలల్లో ఇంకా 40 శాతం ఎలా వస్తాయో చెప్పాలని ఏలేటి నిలదీశారు. ‘కాంగ్రెస్​ది చీటింగ్ బడ్జెట్’ అని మహేశ్వర్ రెడ్డి విమర్శించడంతో మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. పవిత్రమైన బడ్జెట్​ను చీటింగ్ బడ్జెట్ అని ఎలా సంబోధిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కల్లో ఏమైనా తేడాలుంటే సభ దృష్టికి తీసు కురావాలి గానీ చీటింగ్ అని మాట్లాడటం సరికాదన్నారు. దీంతో చీటింగ్ అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య బడ్జెట్​పై అసెంబ్లీలో ఏకంగా గంటన్నరకు పైగా చర్చ జరిగింది.

వసూళ్లు 60 %.. ఖర్చు 80 %: మహేశ్వర్​ రెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీదే పాలన కొనసాగిస్తోందని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటే తప్ప.. రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ‘హ్యాట్రిక్ చీటింగ్ బడ్జెట్’ ప్రవేశపెట్టిందని విమర్శించారు. ఇది ఎండమావి బడ్జెట్ అన్నారు. కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. వివిధ శాఖలకు కేటాయించిన మొత్తంలో 80 శాతం కూడా ఖర్చు చేయడం లేదన్నారు. ‘కాగ్ నివేదిక చూస్తే ప్రభుత్వ అసలు రంగు బయటపడుతుంది.. ఇప్పటి వరకు 60 శాతం రెవెన్యూ రీసీట్స్ మాత్రమే వచ్చాయి.. రెండు నెలల్లో ఇంకా 40 శాతం రావాలి.. ఇది ఎట్లా సాధ్యం? బడ్జెట్​లో రూ.2.04 లక్షల రెవెన్యూ ఆదాయం చూపించారు.. కానీ, కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇది 1.38 లక్షలు మాత్రమే.. భట్టి, రేవంత్ మధ్య అగాధంలాగే లెక్కల మధ్య అగాధం కనిపిస్తున్నది..’ అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణలో పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా రూ.2లక్షల అప్పు ఉందని, ఇందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణమన్నారు. తెలంగాణ మూలధన వ్యయం గుండు సున్నాగా ఉందన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీలకు భారీగా నిధులు పెంచిన ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తోందన్నారు. ‘మహిళలకు నెలకు రూ.2,500 భృతి ఇయ్యలే.. చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇయ్యలే.. వడ్డీలేని రుణాలు ఇవ్వలేదు.. పెళ్లిచేసుకున్న మహిళలకు తులం బంగారం లేదు.. ఇక కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా ఎట్లా చేస్తరు?’ అని ఏలేటి ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములను అమ్మాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. మజ్లీస్​కు మేలు చేసేందుకే జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తున్నారని ఆరోపించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక మనస్తాపంతో చాలా మంది చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. ‘రైతు డిక్లరేషన్ అమలు చేయలేదు. వ్యవసాయ బడ్జెట్​ను తగ్గించారు. అభయహస్తం హామీలకు కేటాయింపులు లేవు. ఇందిరమ్మ ఇండ్లకు భారీ కోత విధించారు’ అని విమర్శించారు. ప్రాణహిత, చేవెళ్ల వంటి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు తగ్గించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు?: సీతక్క ​

మహేశ్వర్ ​రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి సీతక్క కలుగజేసుకొని రాష్ట్రానికి కేటాయించే నిధుల విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వమేనని.. ప్రతిపక్ష పార్టీలు, రైతుల పోరాటంతో దిగివచ్చి ఆ చట్టాలను రద్దు చేశారని గుర్తుచేశారు. వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్​లో రూ.300, వితంతువులకు ఇచ్చే వాటిలో రూ.200 మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఎన్నిసార్లు మొత్తుకున్నా కేంద్రం వాటా పెంచడం లేదని విమర్శించారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసుకొని ఖజానా నింపుకుంటున్న కేంద్రం.. ఆ నిధులను యూపీ, గుజరాత్, బిహార్, ఏపీ రాష్ట్రాల్లో ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. అష్ట దిగ్గజాల్లా 8 మంది ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఏం చేస్తున్నారని సీతక్క ప్రశ్నించారు. ఆంధ్రావాళ్లు నిధులు తీసుకెళ్తుంటే కళ్లప్పగించి చూస్తున్నారని ఫైర్​ అయ్యారు.

చీటింగ్ బడ్జెట్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

మహేశ్వర్ రెడ్డి చీటింగ్ బడ్జెట్ ​వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్​బాబు మండిపడ్డారు. ‘బడ్జెట్ పవిత్రమైన డాక్యు మెంట్. 4 కోట్ల ప్రజలకు సంబంధించింది. అలాంటి బడ్జెట్​ను చీటింగ్ బడ్జెట్ అని ఎట్లా సంబోధిస్తరు? బడ్జెట్​లో ఏమైనా తప్పులు ఉంటే సభ దృష్టికి తీసుకురావాలి తప్ప ఇట్ల మాట్లాడటం సరైంది కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం’ అన్నారు. స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ‘చీటింగ్ బడ్జెట్’ పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత చర్చలో భాగంగా శ్రీధర్ ​బాబు మాట్లాడుతూ కేంద్ర జీడీపీలో 5 శాతం నిధులను తెలంగాణ రాష్ట్రం అందిస్తున్నదన్నారు. అలాంటి రాష్ట్రానికి కేంద్రం నుంచి తిరిగి ఎన్ని నిధులు తీసుకొస్తున్నారని బీజేపీ నేతలను నిలదీశారు.

విద్య గురించి మాట్లాడే హక్కు మీకు లేదు: పొన్నం ​

విద్య గురించి మాట్లాడే హక్కు బీజేపీ వాళ్లకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యకు నిధులు తగ్గించారని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న మంత్రి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర విద్యాలయాలు, నవోదయ స్కూళ్లు ఎక్కడికిపోయని మండిపడ్డారు. ఏవైనా సమస్యలు ఉంటే సీఎం ఆఫీస్ కు వెళ్లి మరీ చెప్పుకునే పరిస్థితి కల్పిస్తే.. అసెంబ్లీ ముందుకొచ్చి లొల్లి చేయాల్సిన అవసరం ఏముందని బీజేపీ లీడర్లను ప్రశ్నించారు. అసెంబ్లీ ముట్టడి పేరుతో సోమవారం బీజేపీ లీడర్లు చేసిన హంగామాపై ఆయన మండిపడ్డారు.