భూదాన్ భూములపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్

భూదాన్ భూములపై  కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
  • మంత్రి పొంగులేటి, కేటీఆర్ కామెంట్లతో రచ్చ
  •     అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్న ప్రభుత్వం 
  •     ఉన్న ఇండ్లు కూల్చి మళ్లీ ఇచ్చుడేందని బీఆర్ఎస్ ప్రశ్న
  •     బీఆర్ఎస్ హయాంలోనే ఇండ్లను కూల్చారన్న కాంగ్రెస్​
  •     అప్పుడెందుకు రెగ్యులరైజ్ చేయలేదని కౌంటర్​

ఖమ్మం/ ఖమ్మం టౌన్​ వెలుగు :  వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంపై రాజకీయం వేడెక్కింది. ఇండ్ల కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్​ బీఆర్ఎస్ అన్నట్టుగా పరిస్థితి మారింది. రెండు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇండ్లు కూల్చుడేనా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడంతో రచ్చ మొదలైంది. 

పెయిడ్ ఆర్టిస్టులతో ఖమ్మంలో కేటీఆర్​ డ్రామా చేశాడని మంత్రి పొంగులేటి ఫైరయ్యారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే భూదాన్ భూముల్లో ఇండ్లను కూల్చిందంటూ పేపర్లలో వచ్చిన కథనాలు, వీడియోలను బయటపెట్టారు. తమది పేదల ప్రభుత్వమని, అర్హులైన వారందరికీ ఇండ్లు ఇస్తామని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగా శుక్రవారం ఖమ్మంలో బీఆర్ఎస్, కాంగ్రెస్​ నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. తప్పు మీదంటే మీదేనంటూ దుమ్మెత్తిపోసుకున్నారు.  

కూల్చివేతలు మొదలుపెట్టిందే బీఆర్ఎస్..  

వెలుగుమట్ల భూదాన్​భూముల్లో ఇండ్ల కూల్చివేతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మొదలుపెట్టిందని కాంగ్రెస్​నేతలు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకుడు సాధు రమేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

2023లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో వెలుగుమట్లలో ఇండ్లను కూల్చేందుకు జేసీబీలు, బుల్డోజర్లను పంపించారంటూ ఆధారాలను బయటపెట్టారు. అర్బన్ తహసీల్దార్​ ఇచ్చిన నోటీసులపైనే అప్పట్లో వారు కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడే బీఆర్ఎస్ ప్రభుత్వం భూదాన్ భూమిలో నివసించే నిరుపేదల ఇండ్లను ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదని ప్రశ్నించారు. 

కేసీఆర్, కేటీఆర్ నిండు శాసనసభలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడానికి వీలులేదని, కబ్జా చేసినవారికి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే కూల్చివేయాలని అధికారులను ఆదేశించించారని గుర్తుచేశారు. కేటీఆర్ ఖమ్మం వచ్చి భూ నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇండ్లు కట్టించి, గృహ ప్రవేశాలు చేయిస్తామని గాలిలో మేడలు కట్టినట్లు ఆశలు కల్పించడం బాధాకరమన్నారు. భూదాన్ భూమిలో అర్హులకు ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందని తెలిపారు. 

మంత్రులు బహిరంగ చర్చకు రావాలి..​ 

భూదాన్​ భూముల్లో ఇండ్ల కూల్చివేతల గురించి బీఆర్ఎస్ పై కాంగ్రెస్​ లీడర్లు బురద జల్లుతున్నారని, దీనిపై ముగ్గురు మంత్రులు బహిరంగ చర్చకు రావాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​సవాల్​విసిరారు. ఖమ్మం తెలంగాణ భవన్​ లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

పేదల గుడిసెలను కూల్చిన పాపం కాంగ్రెస్​ పార్టీకి, ముగ్గురు మంత్రులకు తగులుతుందన్నారు. బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వస్తుంటే, సమస్య చెప్పుకునేందుకు వెళ్లొద్దంటూ కాంగ్రెస్ నాయకులు బాధితులను బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ వస్తే పక్కా ఇల్లు ఇస్తుందని ఆశపడి ఆ పార్టీకి ఓట్లు వేసిన పేదలు పెయిడ్ ఆర్టిస్టులయ్యారా? అని మంత్రి పొంగులేటిని ప్రశ్నించారు. 

వెలుగుమట్లలో జరిగిన ఘటన కేవలం కొద్దిమంది సమస్య కాదని, ఇది రాష్ట్రవ్యాప్తంగా పేదలు ఎదుర్కొంటున్న సమస్య అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పేదల ఇండ్ల కూల్చివేతలు, జీవనాధారాలను నాశనం చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపించారు. బాధితుల తరఫున న్యాయపోరాటానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని తెలిపారు. ఈ ఘటనపై జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామన్నారు.