వార్ వన్ సైడ్..!ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జైత్రయాత్ర

వార్ వన్ సైడ్..!ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జైత్రయాత్ర
  • ఏడు మున్సిపాలిటీల్లో హస్తం హవా
  • కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో హంగ్​
  • కాంగ్రెస్​, సీపీఐకి చెరో 22 సీట్లు

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. ఏడు మున్సిపాలిటీలను కాంగ్రెస్​కైవసం చేసుకుంది. జిల్లాలో రెండేళ్లలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, గ్రామపంచాయతీ ఎన్నికల తరహాలోనే తాజా మున్సిపల్ ఎలక్షన్లలోనూ ప్రత్యర్థి పార్టీలపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. ఖమ్మం జిల్లాలోని మొత్తం 117 వార్డులకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్​ 83 వార్డులను గెల్చుకుంది. బీఆర్ఎస్​ 21 వార్డులతో సరిపెట్టుకుంది. సీపీఎం 3 వార్డులు, సీపీఐ 4 వార్డులు గెలిచాయి. ఇండిపెండెంట్లు  ఆరు వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ సున్నాకు పరిమితమైంది. 

వైరా, కల్లూరు, సత్తుపల్లిలో అధికార పార్టీకి బీఆర్ఎస్​ గట్టి పోటీ ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది. చివరకు అన్ని మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్​సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. అత్యధికంగా కల్లూరులో 7, సత్తుపల్లిలో 6, వైరాలో 5 వార్డులను మాత్రమే గెల్చుకోగలిగింది. ఇక జిల్లాలో బీఆర్ఎస్ తో జతకట్టిన సీపీఎం ఏదులాపురంలో కేవలం 2 వార్డులను గెల్చుకుంది. అది కూడా 20వ వార్డులో సీపీఎంకు మద్దతుగా కాంగ్రెస్​ అభ్యర్థిని నిలపకపోవడం కలిసివచ్చింది. మరోవైపు ఏదులాపురంలో కాంగ్రెస్​ ను విభేదించి సింగిల్ గా బరిలోకి దిగిన సీపీఐ కూడా దెబ్బతిన్నది. మూడు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అన్ని మున్సిపాలిటీల్లో మ్యాజిక్​ ఫిగర్​ ను మించి వార్డులను కాంగ్రెస్ గెల్చుకోవడంతో మున్సిపల్ చైర్​పర్సన్ స్థానాలను గెల్చుకోవడం ఖాయమైంది. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో హంగ్ ఏర్పడింది. కార్పొరేషన్​​లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 సీట్లు వచ్చాయి. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​విజయభేరి మోగించింది. బీఆర్ఎస్ పరువు నిలుపుకుంది.  కార్పొరేషన్ తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో బీజేపీ పాగా వేసింది. అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​ తిరుగులేని ఆధిక్యత సాధించింది. ఇల్లెందులో 24 వార్డులకు 19, అశ్వారావుపేటలో 22 వార్డులకు 17 సీట్లలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.