విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ సహించట్లే: సబితా ఇంద్రా రెడ్డి

విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ సహించట్లే: సబితా ఇంద్రా రెడ్డి

హైదరాబాద్, వెలుగు: టీచర్ల పోస్టుల ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ లీడర్లు కుట్రలు పన్నుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది చూసి కాంగ్రెస్ లీడర్లు సహించలేకపోతున్నారని మండిపడ్డారు. టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, కొంత మంది ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. 

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు టీచర్ల ఖాళీల భర్తీని స్కూల్ ఎడ్యుకేషన్​కు అప్పగించామని చెప్పారు. తొమ్మిదేండ్లలో విద్యారంగం అభివృద్ధి కోసం రూ.1,87,269 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. టీచర్ల ఖాళీలు భర్తీ చేసేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

కోర్టు తీర్పునకు లోబడే బదిలీలు 

టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ హైకోర్టు తీర్పునకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం ఎస్సీఈఆర్టీ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. 

ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. జిల్లాల్లో ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య పాల్గొన్నారు.