- బీఆర్‌ఎస్ ఆస్తుల పంచాది తేలేందుకు పదేండ్లు పడుతది
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
నిజామాబాద్, వెలుగు :‘తెలంగాణలో కాంగ్రెస్‌కు పోటీయే లేదు.. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా సాధించి మరోసారి అధికారంలోకి వస్తాం’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కులమత రాజకీయాలకు విసిగిపోయిన ప్రజలు దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా యూపీఏను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజామాబాద్‌లో డీసీసీ ఆఫీస్ నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ... దేశం గురించి గొప్ప గొప్ప కామెంట్లు చేసే బీజేపీ నేతల్లో ఒక్కరికైనా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆదానీ, అంబానీ ఆస్తులు పెంచడం తప్పితే సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ యాభై ఏండ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు.
బీఆర్‌ఎస్ దోపిడీ గురించి కవిత అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. ఆస్తుల పంచాదితోనే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టిందని, వారి ఆస్తుల పంచాయితీ తెగేందుకు పదేండ్లు పడుతుందన్నారు. జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించిన మహేశ్‌గౌడ్... విభేదాలు పక్కనబెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో దివ్యాంగులకు 74 స్కూటీలు పంపిణీ చేశారు. సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క, గవర్నమెంట్ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్అలీ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్లు తాహెర్, మోహన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత తదితరులు ఉన్నారు.

