- ‘బజరంగ్ దళ్’పై బ్యాన్ హామీతో కాంగ్రెస్ వైపు మొగ్గిన మైనార్టీలు
- ముస్లింలకు 4% రిజర్వేషన్ల పునరుద్ధరణ హామీ తోడైంది
- జేడీఎస్ నుంచి కాంగ్రెస్‌కు ట్రాన్స్ఫర్ అయిన ముస్లిం ఓట్లు
- ఓల్డ్ మైసూరులో అత్యధిక సీట్లను తెచ్చిపెట్టింది
బెంగళూరు: కొంపముంచుతుందని టెన్షన్ పడ్డ ‘బజరంగ్దళ్’ బ్యాన్ కామెంట్సే కాంగ్రెస్‌కు కలిసొచ్చాయి. దీనికి తోడు బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామనే హామీ కూడా అనుకూలంగా మారింది. ఓల్డ్ మైసూరు ప్రాంతంలో ఆ పార్టీలో అత్యధిక సీట్లను సాధించి పెట్టింది. అలాగే రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గేలా దోహదం చేసింది. కర్నాటక రాజకీయాల్లో ఓల్డ్ మైసూరు ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ ఎన్నికల్లో ఇక్కడి 49 సీట్లలో కాంగ్రెస్ 30 స్థానాలు గెలుచుకోగా, జేడీఎస్ 14 స్థానాలకు, బీజేపీ ఐదు సీట్లకు పరిమితమయ్యాయి. ‘బజరంగ్ బలి’ నినాదం ఇక్కడి ఫలితాలపై ప్రభావం చూపింది. ‘బజరంగ్ దళ్’ను నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఒక దశలో ‘బజరంగ్ దళ్’ బ్యాన్ హామీ ఇవ్వడం పొరపాటని కాంగ్రెస్ భావించింది. ఇది మిస్‌ఫైర్ అవుతుందని టెన్షన్పడింది.దీని తీవ్రతను తగ్గించేందుకు “బజరంగ్‌దళ్‌ను బ్యాన్ చేస్తామని చెప్పలేదని.. వారి చర్యలపై ఎంక్వైరీ చేస్తామని మాత్రమే అన్నామని” పార్టీ సీనియర్ నేత చిదంబరం కూడ వివరణ ఇచ్చారు. దీన్ని బీజేపీ చాలా ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రధాని మోడీ సైతం తన ప్రసంగాన్ని జై బజరంగ్ బలి నినాదంతో మొదలు పెట్టారు. ఈ అంశం ఎన్నికల్లో బీజేపీకి అంతగా కలిసిరాలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ వివాదం కాంగ్రెస్‌కు చాలా దోహదం చేసింది. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గేలా చేసింది. ఇక్కడి 49 స్థానాల్లో దాదాపు 30 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 2018లో జేడీఎస్ 24, కాంగ్రెస్ 16, బీజేపీ 9 సీట్లు గెలుచుకున్నాయి. ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో వొక్కలిగలు ఎప్పటిలాగే జేడీఎస్‌కు ఓటేయగా, ముస్లిం ఓటు అత్యధిక శాతం కాంగ్రెస్‌కు ట్రాన్స్ఫర్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపించింది.
ముస్లిం రిజర్వేషన్లు.. వరుణ నుంచి సిద్ధా పోటీ
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా పలు అంశాలు పనిచేశాయని తెలుస్తున్నది. అందులో ముఖ్యమైంది.. తాము అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీజేపీ ప్రభుత్వం 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దుచేసి అందులో నుంచి 2% లింగాయత్‌లు, 2% వొక్కలిగలకు పంచిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని నిలిపివేసింది. రెండోది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఓల్డ్ మైసూర్ ప్రాంతంలోని వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. ప్రచారంలో ఆయన.. ఈ ప్రాంతం సీఎంను రాజధానికి(బెంగళూరు) పంపాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో ముస్లింలు సిద్ధరామయ్యను తమ నాయకుడిగా భావించారు.
బీజేపీకి కలిసిరాని‘బజరంగ్ బలి’ నినాదం
ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో ఇన్నాళ్లు జేడీఎస్ వెంట నడిచిన ముస్లింలు ఈసారి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే ఓల్డ్ మైసూరులో అత్యధిక సీట్లు సాధించాల్సిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో దాన్ని నిజం చేసింది. ఈ ప్రాంతంలో ప్రతిసారి ఎక్కువ సీట్లు సాధిస్తున్న జేడీఎస్, బీజేపీలను నిలువరించి మెజార్టీ సీట్లను గెలుచుకుంది. బీజేపీ తన ప్రచారం చివర్లో ‘బజరంగ్ బలి’ని తన థీమ్‌గా మార్చుకుంది, అయితే రాష్ట్రంలో ఈ కార్డు పనిచేయలే. ప్రజలు ఎమోషనల్ అంశాల ప్రాతిపదికన పోలరైజ్కాకుండా స్థానిక సమస్యలపైనే స్పష్టంగా ఓటు వేశారు.
