న్యూఢిల్లీ: మేకిన్ ఇండియాకు ప్రాధాన్యమిస్తోన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (STQC) నిబంధనల కింద చైనాలో తయారైన సీసీ కెమెరాలకు ధృవీకరణ పత్రం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో చైనాకు చెందిన ప్రముఖ సీసీ కెమెరాల కంపెనీలు హికివిజన్, దహువాకు బిగ్ షాక్ తగిలినట్లైంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 2026, ఏప్రిల్ 1 నుంచి దేశంలో హికివిజన్, దహువా కంపెనీల ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీ కెమెరాల విక్రయాలపై నిషేధం అమల్లోకి రానుంది. దేశంలో ఎవరైనా ఈ కంపెనీల సీసీ కెమెరాలను అమ్మితే చట్టరీత్యా నేరం. ప్రస్తుతం దేశంలోని సీసీ కెమెరాల మార్కెట్లో సింహాభాగం చైనా కంపెనీలదే. 80 శాతం వాటా చైనా కంపెనీల చేతుల్లోనే ఉంది. కేవలం 20 పర్సెంట్ మాత్రమే భారత కంపెనీల వాటా. అమ్మకాలలో దాదాపు మూడింట ఒక వంతు వాటా చైనాదే.
ALSO READ : అమెరికాకు వరుస షాక్లు.. స్పెయిన్ బాటలోనే ఇటలీ..
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో చైనా కంపెనీలు భారత సీసీ కెమెరాల మార్కెట్ నుంచి దుకాణం సర్దుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇది భారతీయ కంపెనీలకు సువర్ణావకాశంగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. ఒకప్పుడు చైనా బ్రాండ్లు గుత్తాధిపత్యం చెలాయించిన మార్కెట్ ఇప్పుడు భారతీయ కంపెనీల నియంత్రణలో ఉంది. ప్రస్తుతం దేశ సీసీ కెమెరాల మార్కెట్లో భారతీయ కంపెనీల వాటా 80 శాతానికి పెరిగింది. సీపీ ప్లస్, క్యూబో, ప్రామా, మ్యాట్రిక్స్, స్పర్ష్ వంటి దేశీయ బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
