అమెరికాకు వరుస షాక్లు.. స్పెయిన్ బాటలోనే ఇటలీ.. ఎయిర్ బేస్ బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటన

అమెరికాకు వరుస షాక్లు.. స్పెయిన్ బాటలోనే ఇటలీ.. ఎయిర్ బేస్ బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటన

ఇరాన్ పై పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాలని చూసిన అమెరికాకు వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇరాన్ ను ఓడించలేక, హార్మూజ్ జలసంధిని చేజిక్కించుకోలేక చేతులెత్తేసిన యూఎస్ కు.. నాటో దేశాలు షాకిస్తున్నాయి. యుద్ధం విషయంలో తమ గగన తలం వాడుకోడానికి వీలు లేదని ఇప్పటికే స్పెయిన్ ప్రకటించింది. అదే బాటలో ఇటలీ కూడా ప్రకటించి ట్రంప్ కు పెద్ద షాకే ఇచ్చింది. 

అమెరికా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తమ దేశంలోని కీలక ఎయిర్ బేస్ ను వాడుకోడానికి వీలు లేదని ఇటలీ ప్రకటించింది. ఇరాన్ పై యుద్ధానికి కీలకంగా ఉన్న సిసిలీ బేస్ నుంచి ఎలాంటి ఆపరేషన్స్ ను ఒప్పుకోమని చెప్పింది. సింగొనెల్లాలోని నావల్ ఎయిర్ స్టేషన్.. ఇది వరకు నాటో, యూఎస్ మిషన్స్ కు కీలకంగా ఉపయోగపడేది. 

ఇరాన్ పై మరింత తీవ్రతతో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్న అమెరికా.. ఎయిర్ క్రాఫ్ట్ లు, బాంబర్స్ ను ఈ బేస్ లో ల్యాండ్ చేసి అక్కడి నుంచి మిడిల్ ఇస్ట్ లో కార్యకలాపాలకు వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ ను టార్గెట్ చేసేందుకు సిసిలీలో ఉన్న ఈ బేస్ చాలా కీలకంగా ఉండేది. 

తిరస్కరణకు కారణం

ఇటలీ స్థావరాన్ని వాడుకునే విషయంలో సరైన అధికార ప్రక్రియలను పాటించనందుకు అమెరికా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇటలీలోని స్థావరాలను అమెరికా సైనిక వినియోగానికి సంబంధించిన ఒప్పందాల ప్రకారం, అటువంటి కార్యకలాపాలు కొనసాగడానికి ముందు రోమ్‌ను అధికారికంగా సంప్రదించి, ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇటాలియన్ అధికారులను ముందుగా సంప్రదించకపోవడమే తిరస్కరణకు దారితీసిందని సమాచారం. ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక బహిరంగ ప్రకటన ఏదీ జారీ చేయలేదు.

మరోవైపు రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో తీవ్రమవుతున్న సంఘర్షణలోకి ఇటలీనీ లాగకుండా ఉండేందుకు, ఇటాలియన్ స్థావరాలను అమెరికా ఉపయోగించకుండా నిరోధించాలని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి.

దీంతో అటువంటి ఏ నిర్ణయాలకైనా పార్లమెంటు ఆమోదం అవసరమని  ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రభుత్వం  స్పష్టం చేసింది. పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబించడాన్ని నిర్ణయించింది.

వ్యూహాత్మక చిక్కులు

ఇటలీ అమెరికాకు నాటో మిత్రదేశంగా కొనసాగుతున్నప్పటికీ, వ్యూహాత్మక స్థావరాలకు ప్రవేశం దానంతట అదే లభించదని, అది రాజకీయ, చట్టపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అదే క్రమంలో ఈ యుద్ధంలో ఏక పక్షంగా వ్యవహరించకుండా బ్యాలెన్స్ డ్ గా వెళ్లాలనే వైఖరిలో ఉన్నట్లు తెలుస్తోంది. 


మిడిల్ ఈస్ట్ లో  పెరుగుతున్న ఉద్రిక్తతలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనడం పట్ల ఐరోపా దేశాలలో ఇప్పటికే సందిగ్ధం నెలకొంది. అమెరికాకు సహాయం చేయాలని.. యుద్ధంలోని రావాలని ట్రంప్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆచితూచి వ్యవహరించాయి. ఇప్పుడు స్పెయిన్, ఇటలీ నిర్ణయంతో యుద్ధం విషయంలో నాటో దేశాల వైఖరి పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది.