- ప్రజాపాలనకు ఈ తీర్పే నిదర్శనం: మహేశ్ గౌడ్
- ఫలితాలు కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చినయ్
- విజేతల్లో 90శాతం అధికార పార్టీ అభ్యర్థులే
- గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమైందని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ కే అనుకూలంగా వచ్చాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారని తెలిపారు. ఫలితాల అనంతరం గురువారం మహేశ్ గౌడ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజా పాలన సాగుతున్నదని అనడానికి ఈ ఎన్నికల తీర్పే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు మంచి సమన్వయంతో అభ్యర్థులను నిలిపి, ప్రచారం చేయడంతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ ఎన్నికల తీర్పుతో గ్రామ స్థాయిలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతున్నదని, స్థానిక ప్రజలను కాంగ్రెస్ నేతలు మరింత నేరుగా కలిసే అవకాశం ఈ తీర్పుతో దక్కిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రెండేండ్ల ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు మరింత సంతృప్తినిచ్చాయని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అందులో తెలిపారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని ఈ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందని చెప్పారు.
ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెంచిందని, పంచాయితీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తమ ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందనడానికి ఈ ఎన్నికల తీర్పే నిదర్శనమని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పీసీసీ భావిస్తున్నది. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం, ప్రధాని మోదీని కలిసి ఒత్తిడి పెంచడం తదితర అంశాలతో కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు గాంధీభవన్‌లో గురువారం పార్టీలోని పలువురు సీనియర్ బీసీ నేతలతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ భేటీ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ పంచాయతీలను గెలుచుకోవడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని.. ఇందుకు ఎక్కువ టైమ్ తీసుకోకుండా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రిజర్వేషన్ల కోసం గత నెలలో సీఎం రేవంత్, మంత్రులంతా బీసీ సంఘాలతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అఖిలపక్షంతో ప్రధానిని కలవాలని నిర్ణయించగా, పలు కారణాలతో అది రద్దయ్యింది.

