భారీ మెజారిటీతో గెలుస్తం: గెహ్లాట్

భారీ మెజారిటీతో గెలుస్తం: గెహ్లాట్

జైపూర్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని రాజస్థాన్ సీఎం అశోక్  గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం గెహ్లాట్ ఉదయ్‌‌పూర్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. " ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని తెలుస్తోంది. అలాగే, ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌‌లో జరగనున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుంది" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "ప్రజల్లో సెంటిమెంట్లు తలెత్తినప్పుడు, అమిత్ షా అయినా, నరేంద్ర మోడీ అయినా.. ఎవరు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు" అని ఆయన పేర్కొన్నారు.

గెహ్లాట్ మంగళవారం ఉదయపూర్, భిల్వారా జిల్లాల్లోని సహాయ శిబిరాలను సందర్శించారు. తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న సహాయ శిబిరాలను ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ పథకం ప్రయోజనాలు ప్రతి లబ్ధిదారుడి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అంతకుముందు.. మౌంట్ అబూలో కాంగ్రెస్ సర్వోదయ సంగం శిబిరంలో పాల్గొనేందుకు ఉదయ్‌‌పూర్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గెహ్లాట్ స్వాగతం పలికారు.