ఢిల్లీల్లో రాష్ట్ర వీఆర్‌‌‌‌ఏ వారసుల నిరసన..3,797 పోస్టులకు నియామక ఉత్తర్వు లివ్వాలని డిమాండ్

ఢిల్లీల్లో రాష్ట్ర వీఆర్‌‌‌‌ఏ వారసుల నిరసన..3,797 పోస్టులకు నియామక ఉత్తర్వు లివ్వాలని డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: తమకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ తెలంగాణకు చెందిన వీఆర్‌‌‌‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)ల వారసులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. వీఆర్‌‌‌‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్‌‌‌‌ మంతర్‌‌‌‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తమ గోడును ఏఐసీసీ పెద్దలకు వినిపించే ఉద్దేశంతో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గతంలో వీఆర్‌‌‌‌ఏలు 81 రోజులపాటు  సమ్మె చేసిన సందర్భంలో నాటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌‌‌‌, సీతక్క, షబ్బీర్‌‌‌‌ అలీ స్వయంగా వచ్చి మద్దతు తెలిపారని వీఆర్‌‌‌‌ఏ జేఏసీ  నేతలు  గుర్తుచేశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, రెండేండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం జీవో 81,85 ద్వారా సుమారు 16,500 మంది వీఆర్‌‌‌‌ఏలను రెగ్యులరైజ్‌‌‌‌ చేసి పోస్టింగ్‌‌‌‌లు ఇచ్చిందన్నారు. 

61 ఏండ్లు పైబడిన 3,797 మంది వీఆర్‌‌‌‌ఏలను గుర్తించి, వారి వారసులకు విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇస్తామని జీవోలో పొందుపరిచారని తెలిపారు. పదో తరగతి పాసైన వారికి అటెండర్‌‌‌‌ పోస్టు, ఇంటర్‌‌‌‌ చదివిన వారికి రికార్డు అసిస్టెంట్‌‌‌‌, డిగ్రీ పూర్తి చేసిన వారికి జూనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌ పోస్టు ఇవ్వాలని జీవో స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు.జీవో ఉన్నప్పటికీ తమకు నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని, దీనివల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు పలువురు బీసీ సంఘం నేతలు మద్దతు ప్రకటించారు.