- బీఆర్ఎస్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై పార్లమెంట్ వేదికగా కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై జరుగుతున్న ప్రచారాన్ని లింగయ్య యాదవ్ తప్పుబట్టారు.
ప్రాజెక్టును రూ. 86 వేల కోట్లతో నిర్మిస్తే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేయడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు.కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ఎవరో రాసిచ్చిన స్క్రిఫ్ట్‌ను పార్లమెంట్‌లో చదివారని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగినట్లు గుర్తుచేశారు. ఆ చిన్న లోపాన్ని సరిచేయడం మానేసి, కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు.
